కేంద్ర హోం మంత్రి హోదాలో బీజేపీ చీఫ్ అమిత్ షా తొలిసారిగా తెలంగాణ‌ రాష్ట్రానికి శ‌నివారం రానున్నారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్య‌క్ర‌మాలలో పాల్గొనేందుకు వ‌స్తున్న అమిత్‌షా ప్ర‌ధానంగా పార్టీ కార్యక‌లాపాల‌పై ఫోక‌స్ చేయ‌నున్నారు. పార్టీ సభ్యత్వ నమోదును  ప్రారంభించి 2023లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేయనున్నారు.

 

తెలంగాణ‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు ఈ మేర‌కు ప్ర‌త్యేక ప‌ర్య‌ట‌న ఏర్పాటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో శ‌నివారం మధ్యాహ్నం 12.30నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 2.40 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.50నిమిషాల నుండి 3.30 వరకు ఎయిర్‌పోర్ట్ లోనే CISF ఆఫీసర్లతో  అమిత్ షా సమావేశం కానున్నారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.45నిమిషాలకు నగరంలోని పహాడీ శరీఫ్ లోని రంగనాయక తండాకు వెళ్లి ఒక గిరిజన కుటుంబానికి పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వనున్నారు. ఆ తర్వాత 4.30నిమిషాలకు KLCC పంక్షన్ హాల్‌లో నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు.రాత్రి 7.15నిమిషాలకు నోవాటెల్ హోటల్ లో రాష్ట్రానికి చెందిన 20మంది ముఖ్యనాయకులతో మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 9.30కి అమిత్ షా తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

 

కాగా, అమిత్ షా రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌ను బీజేపీ నేత‌లు సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. ఆయ‌న రాక సంద‌ర్భంగా భారీగా సభ్యత్వ నమోదు జరుగనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పాటుగా ప‌లువురు నేత‌లు సైతం పార్టీలో చేర‌నున్న‌ట్లు చెప్తున్నారు. మ‌రోవైపు బీజేపీ ముఖ్య‌నేత‌ల‌కు రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతం గురించి అమిత్‌షా దిశానిర్దేశం చేస్తార‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: