హైదరాబాద్: ఎప్పుడూ నవ్వుతూ, మౌనంగా ఉండే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియగాంధీ ఈ మధ్య కాలంలో కోపానికి వస్తూంది. అది మామూలు కోపం కాదు, కాళికామాత లెవల్లో. ఆమెలో వచ్చిన మార్పు ఎవరికీ అర్థం కాక జుట్టుపీక్కుంటున్నారు. ఎంపీగా    పార్లమెంటులో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ వర్షకాలం పార్లమెంటు సమావేశాల నాటికీ ఆమె సభలో ఎప్పుడూ ఎవర్ని దూషించలేదు. ఎవరు ఎన్ని విధాలుగా సభకు అడ్డుపడినప్పటికీ చూస్తూ ఉండిపోయే వారు. కానీ, ఈ దఫా ఆమె స్టైల్ మారింది. మాట తీరు మారింది. స్వరాన్ని పెంచింది. మాటకు రెండు మాటలంటోంది. సభను గడగడలాడిస్తోంది.  సభలో ఆమె ఉన్నారంటే చాలు అందరూ అటెన్షన్తో ఉంటున్నారు.  తానేమీ ఆషామీషీ మనిషిని కాదనే రీతిలో వ్యవహారిస్తోంది. సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు తెలంగాణ కోసం నిరసన చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో సోనియమ్మకు ఒక్కసారిగా కోపమొచ్చింది. సభలో ఉంటే ఉండండి, లేదంటే సభ నుంచి వెళ్లిపోవాలంటూ కాస్త ఘాటుగానే హెచ్చరించిందనీ వార్తలొచ్చాయి. సోనియాగాంధీకి వచ్చిన కోపానికి అందరూ ఒకింత షాక్కు గురయ్యారు. ఇక అప్పటి నుంచి మొదలుకుని నేటి బొగ్గుస్కాంపై బీజేపీ పట్టుబడుతున్న ప్రధాని రాజీనామా వరకు సభలో సోనియాగాంధీ వ్యవహారిస్తున్న అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల సభ్యుల్ని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. వారం రోజులుగా పార్లమెంటును స్తంభింపచేస్తున్న బీజేపీపై ఎదురుదాడికి దిగుతోంది. ఆమే నేరుగా రంగంలోకి దిగడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల్ని తన మాటలతో ఉతికి ఆరేస్తోంది. సభలో అన్నీ తానై సభను ముందుకు నడిపిస్తోంది. అధికార పార్టీ సభ్యులకు ఆమే దిశాదశను నిర్దేస్తోంది. సెంట్రల్ హాల్ లో ఎక్కువ సేపు గడపడానికి ఇష్టపడని ఆమె సెంట్రల్ హాల్లో తీరిగ్గా కూర్చోంటుంది. అంతే కాదు, అక్కడి వచ్చే వారితో పిచ్చాపాటీ కబుర్లు చెబుతూ గడపడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. సభలో ప్రతిపక్షాల సభ్యులకు ధీటుగా ఆమె సమాధానం చెప్పడమే కాకుండా, మిగతా తమ సభ్యలు కూడా ఎదురుదాడి చేయాలనీ, ఎవర్ని వదలిపెట్టవద్దంటూ హుకూం కూడా జారీ చేసింది. మొత్తానికి సోనియాగాంధీలో వచ్చిన మార్పుతో అందరూ కంగుతింటున్నారు. కేంద్రమాజీ మంత్రి, ప్రస్తుత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ సభలో ఉన్నప్పుడు అన్నీ తానే చూసుకునేవారు. సోనియాగాంధీ నామ్ కే వాస్తేగా సభకు వచ్చేవారు. ఆయన సభ నుంచి రాష్ర్టపతి భవన్ వెళ్లాక ఆసీటును ఎవరు భర్తీ చేస్తారోననీ అందరూ అనుకుంటున్న తరుణంలో ఏకంగా పార్టీ అధినేత్రి సోనియానే రంగంలోకి దిగారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దాడికి చేస్తుంటే ఆమెనే ఎదురుదాడికి దిగుతుండటంతో ప్రతిపక్షాలు సైతం ఒకింత ఆశ్చర్యానికి, అయోమయానికి గురౌతున్నాయి. సోనియాగాంధీ అపర కాళీమాతగా మారడం చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: