తెలుగుదేశంపార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు రాజీనామాలు చేసి చంద్రబాబునాయుడుకు గట్టి షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా పరిషత్ తామా మాజీ ఛైర్మన్ ఈదర హరిబాబుతో పాటు గుంటూరు జిల్లాలో సీనియర్ నేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు సాంబశివరావు రాజీనామాలు చేశారు. వీరిద్దరూ బిజెపిలో చేరారు.

 

మొన్నటి ఎన్నికలో టిడిపి ఓడిపోయిన దగ్గర నుండి చాలామంది నేతలు పార్టీ నుండి బయటకు వచ్చేయటానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొందరు అగ్రనేతలు రాజీనామాలు చేసేయగా మరికొందరు అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపిలు, ఓ మాజీ ఎంఎల్ఏ టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. మాజీ ఎంఎల్ఏ పార్టీకి రాజీనామా చేయగా రాజ్యసభ ఎంపిలు మాత్రం బిజెపిలోకి ఫిరాయించారు.

 

ఇక ఈదర విషయానికి వస్తే ఈయన జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పదవీకాలం అయిపోయేంత వరకూ టిడిపిలోనే ఉన్నారు. ఎప్పుడైతే పదవీకాలం ముగిసిందో వెంటనే రాజీనామా చేసేశారు. ఇటు టిడిపికి రాజీనామా చేయటం వెంటనే బిజెపిలో చేరిపోవటం ఒకేసారి జరిగిపోయింది. దాదాపు 30 ఏళ్ళు టిడిపిలోనే ఉన్న చందు కూడా బిజెపిలో చేరుతారని ఎవరూ ఊహించలేదు.

 

టిడిపి నేతలకు జగన్మోహన్ రెడ్డి గేట్లు తెరవని కారణంగా చాలామందికి బిజెపిలో చేరటం ఒకటే మార్గంగా కనిపిస్తోంది. నిజానికి చాలామంది టిడిపి నేతలు వైసిపిలో చేరటానికి చాలా ప్రయత్నాలే చేసుకుంటున్నారు. కానీ వివిధ కారణాల వల్ల జగన్ అందుకు ఒప్పుకోవటం లేదు. దాంతో వాళ్ళంతా అర్జంటుగా బిజెపిలో చేరిపోతున్నారు. తొందరలో చాలామంది కమలం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: