తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోనుందని భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు నిజ‌మయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దేశంలో కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న‌ట్లే...ప‌శ్చిమ‌బెంగాల్లో సైతం రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని అసంతృప్త నేతలు రాజీనామాలు చేశారు. మరోవైపు గోవాలో ఏకంగా సీఎల్పీని బీజేపీలో విలీనం చేశారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధ‌మైన‌ట్లు....బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 

 

బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లోని 107 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. కమలం పార్టీలో చేరేవారిలో అధికార టీఎంసీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, సీపీఎం శాసనసభ్యులు ఉన్నారని వివరించారు. పార్టీలో చేరే వారి జాబితాను తయారు చేశామని, వాళ్లంతా తమతో టచ్‌లోనే ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముకుల్ రాయ్ 2017లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. టీఎంసీ ముఖ్యుల‌తో ఆయ‌న‌కు సంబంధాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ముకుల్ ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. 

 

ఇదిలాఉండ‌గా, బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం సభ్యుల సంఖ్య 294. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి అత్యధికంగా 211 సీట్లు రాగా, బీజేపీకి కేవలం 3 సీట్లే దక్కాయి. కాంగ్రెస్‌ 44సీట్లు సొంతం చేసుకోగా..వామపక్షాలు 32స్థానాల్లో గెలుపొందాయి. ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే దూకుడులో రాష్ట్రంలో అధికారం కైవ‌సం చేసుకునేందుకు ఆ పార్టీ స‌న్నాహాలు చేస్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: