టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పరిటాల ఫ్యామిలీ ధర్మవరం మీద ఆధిపత్యం కోసం చాలా ప్రయత్నించింది. కానీ చంద్రబాబు వారిని రాప్తారు వరకే పరిమితం చేశారు. రాప్తాడు చాలదంటూ మరో నియోజకవర్గం బాధ్యతలు కూడా కోరిన పరిటాల కుటుంబం చివరకు రాప్తాడులోనే చిత్తు అయ్యింది. ఇక మరోవైపు ధర్మవరంలో వరదాపురం సూరి కూడా ఓటమి పాలయ్యాడు. ఆయనా ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయాడు. భారీ మెజారిటీని ప్రత్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి అప్పగించి ఓడిపోయాడు వరదాపురం సూరి.


అలా తను ఓడిపోవడం, తన పార్టీ ఓడిపోవడంతో.. వరదాపురం సూరి లేట్‌ ఏమీలేకుండా పార్టీ మారాడు. భారతీయ జనతా పార్టీ నేత అయిపోయాడు ఆయన. భారీఎత్తున రోడ్డు కాంట్రాక్టు పనులు చేసి ఉండటం, వాటిల్లో అక్రమాలు చోటు చేసుకుని ఉండటంతో.. వరదాపురం వాటి నుంచి బయటపడటానికి బీజేపీలోకి చేరారు అనేది బహిరంగ రహస్యమే. అలా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీకి ఇన్‌చార్జి లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ ధర్మవరం బాధ్యతలు కావాలంటూ తెగ ఉవ్విళ్లూరిన పరిటాల కుటుంబానికే అవి దక్కాయి.


అయితే ఇప్పుడు అవి బాధ్యతలు కాదు, భారం! పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అలాంటివి అన్నీ కావాలని అనిపిస్తాయి ఎవరికైనా. పార్టీ చేతిలో అధికారం లేకపోతే పార్టీ పదవులు అన్నీ భారమే అనిపిస్తాయి నేతలకు. ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవాలి. ఆపై ధర్మవరం కూడా పరిటాల కుటుంబానికే అప్పగించారట చంద్రబాబు నాయుడు. మరెవరూ గతిలేకపోవడంతో పరిటాల కుటుంబానికే ధర్మవరం పగ్గాలు ఇచ్చారు. ఇలా ఎట్టకేలకూ పరిటాల సునీత కోరింది జరిగింది. ధర్మవరం నియోజకవర్గం వారి చేతికే దక్కింది. ఇక ఆ నియోజకవర్గంలో ఎంతైనా దున్నుకోవచ్చు! అయితే పరిటాల కుటుంబమే ఇప్పడు బీజేపీ వైపు చూస్తూ ఉందనే టాక్‌ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: