కాళేశ్వరం గొలుసుకట్టు ప్రాజెక్టుల్లో గోదారమ్మ ఒదిగి పోతున్నది. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌ లో శనివారం సాయంత్రానికి 5.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరం వరకు చేరిన బ్యాక్‌ వాటర్‌.

అంబటిపల్లి, సూరారం, బెగ్లూరు, బొమ్మాపూర్‌, బ్రాహ్మణపల్లి, మహదేవ్‌పూర్‌, కన్నెపల్లి వరకు విస్తరించింది. కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి శనివారం వరకు ఒకటో నంబర్‌ పంప్‌ నుంచి 0.9 టీఎంసీ, మూడో నంబర్‌ పంప్‌ నుంచి 0.45 టీఎఎంసీ, నాలుగో నంబర్‌ పంప్‌ నుంచి 0.48టీఎంసీ, ఆరో నంబర్‌ పంప్‌ నుంచి ఒక టీఎంసీ.. ఇలా దాదాపు 2.9 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. కన్నెపల్లి నుంచి అన్నారం బరాజ్‌వరకు గ్రావిటీ కాల్వ ద్వారా దాదాపు 13.5 కిలోమీటర్ల దూరంలో 36 మీటర్ల వెడల్పుతో గోదావరి పరుగులు పెడుతున్నది.

10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అన్నారం బరాజ్‌లోకి శనివారం సాయంత్రానికి 1.37 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దట్టమైన అడవిలో గ్రావిటీ కెనాల్‌ పొడవునా గోదావరి పరవళ్లు. ఆకుపచ్చని అరణ్యంలో అపురూప సీన్‌.

'' బీడువారిన తెలంగాణలో గిన్ని నీళ్లను చూస్తామని కలలో కూడా అనుకోలేదు. కానీ సీఎం కేసీఆర్‌ మొండి పట్టుదలతో, గుండె ధైర్యంతో గోదారమ్మను మెప్పించి, బీడు భూముల ఆకలి తీర్చి అన్నదాతకు జీవధార పోస్తాండు '' అని మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం ప్రజలు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: