జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యోగుల బదిలీల్లో బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. కీలక ప్రభుత్వ శాఖల్లో కోరుకున్న చోట నిమిత్తం... ఉద్యోగులు పాలకుల సిఫార్సుల కోసం పరుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా కొందరు పాలకులు డివిజన్ స్థాయిలో ఒక్కో పోస్టుకు రూ.5 లక్షలకు పైగా ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బదిలీలకు సంబంధించి భారీ స్థాయిలో ముడుపులు చెల్లించిన శాఖల్లో అడిట్ శాఖ అగ్రస్థానంలో నిలుస్తుందనే విమర్శలు ఉన్నాయి. అవినీతికి  తావులేదని ,  పైరవీల మాటే వినిపించకూడని, పారదర్శక పాలన అందిస్తామని సీఎం పదవి చేపట్టినప్పటి నుంచీ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్న మాటలివే. అయితే పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. దీనికి చక్కటి ఉదాహరణ ప్రస్తుతం జరిగిన బదిలీలే.

భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డివిజన్ స్థాయి అధికారి  కావాల్సిన ప్రాంతానికి వెళ్లాలంటే రూ. లక్ష నుంచీ రూ.10 లక్షల వరకూ చెల్లించాలని తెలుస్తుంది. ఆకరికీ చిరుద్యోగి కూడా పెద్దలను ప్రసన్నం చేసుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారాలన్నీ విజయవాడ కేంద్రంగానే సాగాయని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలీస్, రెవిన్యూ శాఖల్లో బదిలీలు పూర్తిచేసింది. పంచాయితీ రాజ్, వ్యవసాయ, అడిట్  తదితర శాఖల్లో బదిలీల ప్రక్రియ దాదాపుగా పూర్తీ కావొచ్చింది.

అయితే చిరుద్యోలతో పాటు ఓ స్థాయి అధికారి వరకు బదిలీల్లో కావాల్సిన ప్రాంతానికి వెళ్ళడానికి పైరవీలు , బేరసారాలు జోరుగా సాగుతున్నాయని కొందరు స్థానికాధికారులు వాపోతున్నారు. ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో అర్హత సాదించిన నిరుద్యోగులకు పలు ప్రభుత్వ శాఖల్లో తాత్కాలికంగా ఉద్యోగాలను కల్పించారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన పాలకులు పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న తాత్కాలిక  ఉద్యోగులను తొలగించీ వారి స్థానాల్లో కొత్తగా తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖలను బట్టి రూ. లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు పాలకులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: