జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ  కార్యాలయాల్లో  సిబ్బంది కొరత ఏర్పడుతుంది. అవినీతి  పెరిగిపోవడంతో ఇక్కడ పనిచేయాలంటే ఉద్యోగులు భయపడుతుండగా.. తాజాగా జరిగిన బదిలీల్లో ఇద్దరు సూపరింటెండెంట్ లు బదిలీపై వెళ్లడం, కొత్త ఉద్యోగులు రాకపోవడంతో కార్యాలయంలో సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్నవారిపైనే అదనపు  భారం పడుతోంది . ఫలితంగా ఎక్కడి ఫైల్స్ అక్కడే మూలుగుతున్నాయి. తాజాగా జరిగిన బీసీ సంక్షేమ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ సూపరింటెండెంట్ లు నారాయణ మూర్తి, తౌదు బాబులను విశాఖ పట్నం , విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. అయితే వీరి స్థానంలో ఎవ్వరికి కొత్తగా పోస్టింగులు ఇవ్వలేదు. దీంతో కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది . ప్రస్తుతం కార్యాలయంలో రెండు సూపరింటెండెంట్ పోస్టులతో పాటు, ఒక జూనియర్ అసిస్టెంట్ , ఒక సీనియర్ అసిస్టెంట్ పోస్ట్లు  ఖాళీగా ఉన్నాయి. 
కార్యాలయంలో రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ ఒక్కడే ఉన్నాడు. మిగిలిన జూనియర్ అస్సిస్టెంట్లలో ఒకరు టెక్కలి సహాయ బీసీ అధికారి కార్యాలయం నుంచి, మరొకరిని శ్రీకాకుళం సహాయ బీసీ-2 కార్యాలయం నుంచి డిప్యూటేషన్ పై పంపించారు. వీరిలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అక్కడి ఫైల్స్ మూలుగుతున్నాయి
అదేవిధంగా అవుట్ సోర్సింగ్ విధానంలో ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు  పనిచేస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనీ కార్యాలయ సిబ్బందిని కోరారు. ప్రస్తుతం ఈ కార్యాలయానికి అవినీతి మరకలు అంటుకన్నాయని కొందరు వాపోతున్నారు. గడిచిన ఐదేళ్ళలో ఏసీబీ దాడుల్లో రూ.85 లక్షల అవినీతి జరిగినట్లు అధికారులు తెలియజేశారు. విద్యార్థులు లేకుండానే వసతి గృహాలకు నిధులు మంజూరు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ దాడుల నేపథ్యంలో ముగ్గురు జిల్ల్లా సంక్షేమాధికారులు, బీసీ సంక్షేమ శాఖ కార్యసిబ్బందిపై కేసులు నమోదుచేసారు. 
అందులో ఒకరు ఉద్యోగ విరమణ చేయగా , మిగిలిన వారిపై కేసులు నడుస్తుండడంతో వారు విధులు నిర్వహించడానికి కార్యాలయానికి రావడం లేదు. అలాగే ఆరు నెలల క్రితం జూనియర్ అసిస్టెంట్ రూ.లక్ష లంచం తీసుకుంటూ  ఏసీబీకి పట్టుబడ్డాడు, ఆ అవినీతి భాగోతంలో అప్పటి జిల్లా సంక్షేమాధికారికి సంబంధం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కార్యాలయంలో ఎటువంటి మార్పు కనిపించడంలేదు. ఇప్పటికీ బీసీ సంక్షేమ శాఖ  కార్యాలయంలో ఫైల్స్ అలాగే ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: