ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ తీవ్ర‌వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మంద‌కృష్ణ‌ కామెంట్ల నేప‌థ్యంలో వైఎస్ఆర్‌సీపీ నేత‌, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగమ్ సురేష్ మీడియాతో మాట్లాడుతూ అదే రీతిలో స్పందించారు. మందకృష్ణ మాదిగ పోరాటం వల్ల టీడీపీకి చాలా లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. మందకృష్ణలో దళితులపై ప్రేమ కనిపించడం లేదని అన్నారు. దళితులకు సీఎం వైయస్ జగన్  చేస్తున్న మంచిని అడ్డుకోవాలనేలా మందకృష్ణ తీరు ఉందని మండిప‌డ్డారు. వైయస్సార్ కాంగ్రెస్  ప్రభుత్వం దళితులకు దగ్గరవుతుంటే మందకృష్ణ భయపడుతునట్లు ఉందని వ్యాఖ్యానించారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ నుండి వచ్చి ఈ హడావిడి ఎందుకని ప్ర‌శ్నించారు. మందకృష్ణ వెనుక ఏ చంద్రుడు ఉన్నాడో దళితులకు తెలుసని సురేష్ వ్యాఖ్యానించారు. 

 

15 రోజుల క్రితం వైయస్ జగన్‌ను పొగిడిన మంద‌కృష్ణ‌ ఇప్పుడు తిట్టడం వెనకున్న ఆంతర్యం ఏంటో చెప్పాల‌ని సురేష్ డిమాండ్ చేశారు. దళితులకు ఎలా మంచి చెయ్యాలో సీఎం జగన్‌కు తెలుసని, ఈ విష‌యంలో మందకృష్ణ చెప్పాల్సిన అవసరం లేదని ఆయ‌న అన్నారు. దళితులకు మేలు జరిగితే తన పబ్బం గడవదని మందకృష్ణ ఉలిక్కి పడుతున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ``సీఎం జగన్‌తో మాట్లాడేందుకు సమయం ఇస్తామన్నా రాకుండా గొడవలు  సృష్టించేందుకు  ప్రయత్నిస్తున్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం.. ధర్నాలు, బంద్‌లు లాంటి ఆలోచనలు మానుకోవాలి. వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది.. రాష్ట్ర పరిధిలోది కాదు. వర్గీకరణ జరిగితే దేశం మొత్తం జరగాలి.. ఒక్క ఏపీలో మాత్రమే జరిగేది కాదు..`` అని స్ప‌ష్టం చేశారు.

 

దళితులకు అన్ని రకాలుగా అదుకుంటానని సీఎం వైయస్ జగన్  చెప్తున్నారని సురేష్ వెల్ల‌డించారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఇతర పదవులు, పథకాలు ఎస్సీలకు మేలు కలిగేలా చేస్తున్నారని ఇదే రీతిలో ఆయ‌న భ‌విష్య‌త్తులోనూ ద‌ళితుల సంక్షేమం కోసం నిర్ణ‌యం తీసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: