జాబిల్లి మీదకు రాకెట్‌ పంపిస్తాం కానీ,వీరికి మాత్రం ఆస్పత్రికి దారి లేదు..? 
చంద్రుడి మీదికి రాకెట్‌ పంపిస్తున్న శుభ సమయంలో, ఈ గిరిజనులకు ఆసుపత్రికి దారి లేక పోవడం ఒక గొప్ప విషాదం !! అది సభ్యసమాజానికి దూరంగా.. సమస్యలకు చాలా దగ్గరగా ఉండే గిరిజన గ్రామం కొత్తవలస. విశాఖ ఏజెన్సీలోని మాడుగుల మండలంలో ఉంది. ఎవరికైనా రోగం వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు లేదు. భుజాలపై మోసుకుంటూ,తీసుకెళ్లాల్సిందే... ఆదివారం ఆ గ్రామానికి చెందిన నూకరాజు భార్య దేవి నిండు గర్భిణి, పురిటి నొప్పులు వచ్చాయి.

ఆస్పత్రి ఐదు కిలోమీటర్ల వరకు సరైన రోడ్డు మార్గం లేదు. పైగా మధ్యలో ఉరక గెడ్డ ఉంది. వర్షాలు పడుతుండడంతో దారి మొత్తం బుదరమయమైంది. ఆమెను ఎలాగైనా కాపాడాలని, భర్త నూకరాజు, కుటుంబ సభ్యుల సాయంతో కర్రకు దుప్పటిని డోలీగా కట్టి, దానిలో ఆమెను కూర్చోబెట్టారు. ఉదయం ఆరున్నరకు నడక మొదలుపెట్టారు. కుటుంబ సభ్యులు డోలీలో మోసుకుంటూ 5 కిలోమీటర్లు బురద దారిలో ప్రధాన రోడ్డుకు చేర్చారు. అప్పటికే 108కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్‌వచ్చింది. అందులో ప్రాథమిక చికిత్స అనంతరం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేజేపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే స్పందించి సుఖ ప్రసవం చేశారు.

దేవి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ ఏజెన్సీలో ఇలాంటి సంఘటనలు గత సంవత్సరం ఇంకా ఎక్కువగా జరిగాయి. రోడ్డుమీదనే ప్రసవాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. సరైన రహదారులు లేని చోట బైక్‌ అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు కానీ, అవి సరిపోవడం లేదు. అందుకే గిరిజనులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. జగన్‌ ప్రభుత్వం ఈ సమస్యల పై స్పందించి, రహదారులు వేయాలని గిరిజనులు కోరుతున్నారు.

'చంద్రయాన్‌'ని అంతరిక్షంలోకి పంపిస్తున్నాం...'నిండు గర్భిణీ'ని మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్ళలేకపోతున్నాం... అని సామాజిక విశ్లేషకులంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: