కొంద‌రు నాయ‌కుల‌కు వివాదాలు అంటే భ‌లే స‌ర‌దా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. భారతీయ జనతా పార్టీ భోపాల్‌ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్ ఇదే కోవ‌లోకి చెందుతారేమో! ఎందుకంటే...ఆమె మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వర్షాలు పడడంతో తన పార్లమెంట్‌ పరిధిలోని పలు ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో అక్కడ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టాలని ఎంపీ ప్రగ్యాకు స్థానిక నాయకులు విజ్ఞప్తి చేశారు. నాయకుల విజ్ఞప్తిపై ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ``టాయిలెట్లు, మురికి కాలువలు శుభ్రం చేయడానికి నేను పార్లమెంట్‌కు ఎంపిక కాలేదు. మీరు అర్థం చేసుకోవాలి. నేను కేవలం స్థానిక ఎమ్మెల్యేలకు, మున్సిపల్‌ అధికారులకు, కార్మికులకు మాత్రమే ఆదేశాలు జారీ చేస్తాను. వారితో పని చేయించుకోవాలి` అని ఆమె కార్యకర్తలకు సూచించారు. ప్రగ్యా సమాధానంపై స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ వివాదంలోకి హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎంట్రీ ఇచ్చారు!


భోపాల్ ఎంపీ సాధ్వి ప్రగ్యా కుల అహంకారానికి ఈ మాటలే ఓ నిదర్శనం అని ఓవైసీ వ్యాఖ్యానించారు. సాధ్వి మాటలతో తానేమీ ఆశ్చర్యపోలేదని.. ఆమె ఆలోచన విధానమే అలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆమె కులాలను కించపరిచారని విమర్శించారు. ఆ పనిని ఎవరు చేయాలో వాళ్లే చేయాలన్నట్టుగా ఆమె క్లియర్ గా చెప్పినట్టుగా అనిపిస్తోందని అసదుద్దీన్ చెప్పారు. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్‌ను ఆమె బహిరంగంగానే వ్యతిరేకించిందని ఒవైసీ అన్నారు.


దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ అనేక ప్రసంగాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే ప్రగ్యా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకుడు తారీక్‌ అన్వర్‌ స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనం. ఆమెపై ప్రధాని మోదీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మ‌రోవైపు సాధ్వి మాటలు బాధ్యతాయుతంగా లేవంటూ పార్టీ నాయకత్వం కూడా ఆమెను మందలిచింది. ఈ సాయంత్రం ఆమె ఢిల్లీలోని పార్టీ ఆఫీస్ లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిసి ఈ అంశంపై చర్చించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: