టీడీపీ నాయకులంతా మాజీలుగా మారిపోయినా అధికార మత్తులోనే జోగుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లోనే మకాం వేసి తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నారు. సభలు, సమావేశాలు కార్యాలయాల్లోనే నిర్వహిస్తూ అటు ప్రజలకు, ఇటు అధికారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీరిలో కొంతమంది అధికారులు సైతం రాచమర్యాదలు చేయడం విడ్డురంగా ఉందంటున్నారు. సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయంలో కొంతకాలంగా సాగుతున్న తంతే ఇది. స్థానిక మండల పరిషత్లో ఒకవైపు వాలంటీర్ ఇంటర్వ్యూలు, మరో వైపు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మండల ప్రత్యేకాధికారి గదిలో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. 

వీరికి సరిపడా కుర్చీలు వేయించి మండల అధికారులు సకల మర్యాదలు చేయడంతో అక్కడవారంతా ఆశ్చ్యపోయారు. మండల ప్రత్యేకాధికారి కుర్చీలో మాజీ జెడ్పీటీసీ భర్త ఎల్ఎల్ నాయుడు ఆశీనులు కాగా, తనకి ఇరువైపులా మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తి, మండల మాజీ ఉపాధ్యాయుడు ఎస్ భీమారావు , పార్టీ మండలాధ్యక్షుడు జోరు భమారావు తదితరులు కూర్చున్నారు. మాజీలైన వీరందరికి అధికార మత్తు ఇంకా వదల్లేదని, కార్యలయాల్లో కూర్చుని ఇష్టానుసారంగా వ్యవహించడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 రోజు రోజు కు వీరి అధికార మత్తు అంచెలు దాటుతుందని అక్కడవారు వాపోతున్నారు. అక్కడ అధికారులు కూడా వారికి ఎర్రతివాచి కప్పడంతో వారు ఆడిందే ఆటగా..పాడిందే పాటగా సాగుతుందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మండల ప్రత్యేకాధికారి వివి కృష్ణమూర్తి వివరణ కోరగా టీడీపీ నేతలు సమావేశం నిర్వహించినట్లు తనకు తెలియదని, ఇక నుంచి తన గదికి తాళం వేయాలని సిబ్బందికి చెబుతానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: