ఉత్కంఠ‌కు తెర‌దించుతూ...కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడం తెలిసిన సంగ‌తే.  సంకీర్ణ ప్రభుత్వం ఓటమి పాలైన నేపథ్యంలో సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ వాజూభాయ్‌వాలా కోరారు. కాగా, ముఖ్య‌మంత్రిగా య‌డ్యుర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నార‌నే విష‌యం తెలిసిన సంగ‌తే. అయితే, ఈ స‌మ‌యంలో య‌డ్డీ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకోనున్నారు.


కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ఓటింగ్‌ నిర్వహించగా.. కనీస మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతును కుమార సర్కార్‌ సంపాదించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 14 నెలల కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. 99- 105 ఓట్ల తేడాతో ప్రభుత్వం పడిపోయింది. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగోసారి పీఠమెక్కనున్నారు బొక్కనకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప. విశ్వాసపరీక్షలో కుమారస్వామి సర్కార్ ను కూల్చిన యెడ్డీ రేపోమాపో సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు. ఇప్పుడు నాలుగోసారి సీఎం పదవి చేపట్టబోతున్నారు.
యడ్యూరప్ప 2007లో మొదటిసారి కర్ణాటక సీఎం అయ్యారు . 2007 నవంబర్ 12 నుంచి అదే నెల 19వరకు సీఎంగా ఉన్నారు. మొత్తంగా మొదటిసారి 7 రోజులే యెడ్డీ సీఎం అయ్యారు. రెండోసారి 2008 మే 30 నుంచి 2011 జులై 31వరకు సీఎంగా ఉన్నారు. మళ్లీ 2018 మే 17 నుంచి మే 19వరకు రెండు రోజులు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో తగినంత మెజారిటీ లేకపోవడంతో బలపరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా యెడ్డీ చేశారు. తాజాగా మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోనున్నారు. 


ఇదిలాఉండ‌గా, అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాసపరీక్ష ఓటమితో విక్టరీ మూడ్ లో ఉన్న యెడ్డీ తమది ప్రజస్వామిక విజయమన్నారు. సంకీర్ణ కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడం కర్ణాటక ప్రజల విజయం అన్నారు. కుమారస్వామి ప్రభుత్వం పనితీరుపై కన్నడ ప్రజలు విసిగిపోయి ఉన్నారని చెప్పారు. కొత్తపాలన, అభివృద్ధి రాబోతోందని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నానని చెబుతున్నా అన్నారు. కర్ణాటక రైతులకు రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యత పెరుగుతుందని.. వారికి మంచిరోజులు రాబోతున్నాయని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: