ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం నాయకులు సభా సంప్రదాయాన్ని పాటించకుండా చర్చలను పక్కదోవ పట్టిస్తున్నారంటూ  ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పెన్షన్ గురించి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రశ్నించగా దానికి వైసీపీ తరపున మంత్రులు సమాధానమిచ్చారు. అయినా తమకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వడంలేదని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చే క్రమంలో స్పీకర్ టీడీపీ సభ్యులు బుచ్చయ్య చౌదరి,నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడుపై స్పీకర్‌ సస్పెషన్‌ వేటు వేశారు.

గురువారం కూడా ఏపీ శాసనసభ నుంచి మరో నలుగురు తెదేపా సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. నదీ జలాల పంపకంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా తెదేపా ఎమ్మెల్యేలు సభకు ఆటంకం కలిగించారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో తెదేపా ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. 

దీంతో స్పీకర్‌ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన నలుగురు తెదేపా సభ్యుల్ని సస్పెండ్ చేయాలంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదించారు. వారంతా సభ నుంచి వెళ్లాలని స్పీకర్‌ సూచించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మార్షల్స్‌ సాయంతో వారిని బయటకు పంపించారు. ఈ రోజు సభ ముగిసేవరకు స్పీకర్‌ ఈ నలుగురినీ సస్పెండ్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: