తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇటీవ‌ల ఆ రాష్ట్రాన్ని అత‌లాకుతలం చేసిన‌ ఫొని తుఫాన్ స‌మ‌యంలో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తెలంగాణ నుంచి వెయ్యిమంది ఉద్యోగులు ఒడిశా త‌ర‌లివెళ్లారు. ఒడిశాలో కరంట్ స్తంభాలు పడిపోయి, లైన్లు తెగి చాలా ప్రాంతాలకు విద్యు త్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంపై స్పందించిన సీఎం కేసీఆర్ ఒడిశాకు సహాయం అందించాలని అధికారుల‌ను ఆదేశించడంతో  ఈ  మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఫొని తుపాను సమయంలో చేసిన సహాయానికి పట్నాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు.

సైక్లోన్‌ ఫొని విధ్వంసం అనంతరం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఒడిశాకు తెలంగాణ సర్కార్‌ అందించిన సాయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 'విద్యుత్‌ పునరుద్ధరణలో నిపుణులైన తెలంగాణ సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయం. ఒడిశాలో వీలైనంత త్వరగా విద్యుత్‌ను ప్రజలకు అందించడంలో తెలంగాణ విద్యుత్‌ సిబ్బంది కృషి అభినందనీయం' అని సీఎం నవీన్‌ పేర్కొన్నారు. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ స‌హాయాన్ని గుర్తు చేసుకొని లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం.


ఇదిలాఉండ‌గా, కొద్దికాలం క్రితం కేసీఆర్ ఒడిశా సీఎంతో దేశంలో గుణాత్మక మార్పు కోసం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అనే నినాదంతో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. జాతీయ స్థాయి పర్యటనలో భాగంగా ఒడిశా వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాళ్లిరువురు ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు. ఆ త‌ర్వాత కొద్దికాలానికి ఒడిశాను విప‌త్తు అత‌లాకుత‌లం చేయ‌గా...కేసీఆర్ స‌ర్కారు స‌హాయం చేసింది.  కాగా, ఒడిశాపై విరుచుకుపడిన పెను తుఫాన్ ఆ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది.ఫొని తుఫాను ధాటికి నిరాశ్రయులైన వారికి అండగా నిలిచేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయక నిధికి సీఎం నవీన్ పట్నాయక్ ఏడాది జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: