కేంద్రంతో సంబంధాలపై టిఆరెస్ క్లారిటీతోనే ఉందా, వ్యతిరేకిస్తున్నామంటూనే పార్లమెంట్ లో బిల్లు ఆమోదానికి వ్యూహాత్మకంగా సహకరిస్తోందా కీలక ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు స్నేహ హస్తం అందించిన టీఆర్ ఎస్ ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు దూరంగా ఉండి ఇన్ డైరెక్ట్ గా సహకరించిందా, మరోవైపు రాష్ట్రంలో బీజేపీపై టీఆర్ ఎస్ నేతల విమర్శల వెనుక మతలబ్ ఏంటి.? కీలకమైన బిల్లుల ఆమోదం విషయంలో కేంద్రం పట్ల ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది.



అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ ఎస్ బిజెపిల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. దాంతో టీఆర్ ఎస్ కు, ఆ పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందన్న చర్చ మొదలైంది. అయితే కేంద్రంతో రాష్ర్టానికి రాజ్యాంగ బద్ధంగా వుండే సంబంధాలు కొనసాగిస్తామని టీఆర్ ఎస్ ప్రకటిస్తూ వస్తుంది. ఆ క్రమంలో పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుల ఆమోదం విషయంలో టీఆర్ ఎస్ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



రాజ్యసభలో ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు టీఆర్ ఎస్ మద్దతు ఇచ్చింది. అమిత్ షా స్వయంగా కోరడంతో టీఆర్ ఎస్ సానుకూలంగా స్పందించింది. ఇక కీలకమైన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో లోక్ సభలో ఓటింగ్ కు దూరంగా వుంది టీఆర్ ఎస్. అటు రాజ్యసభలో చర్చలు కూడా పాల్గొనకుండా సమావేశానికి దూరంగా వుంది. టీఅర్ఎస్ తాను తీసుకున్న స్టాండ్ తో రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి ఇన్ డైరెక్ట్ గా సహకరించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే సమయంలో రాష్ర్టానికి వచ్చే సరికి టీఆర్ ఎస్ నేతలు కేంద్రంపై సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు.



కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యా విధానం ముసాయిదాలోని అంశాలపై మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు.కేంద్రానికి రహస్య ఎజెండా ఉందని ముసాయిదాలో స్పష్టత లేదని కుట్ర కోణం కనిపిస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొత్తంగా చూస్తే పైకి మాత్రం టిఆర్ ఎస్ తమకు బీజేపీతో ఎటువంటి స్నేహ సంబంధాలు లేవంటుంది. కేంద్రంతో రాజీ పరంగా ఉండాల్సిన సంబంధాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని తేల్చి చెబుతుంది. ఏదేమైనా ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం సమయంలో టీఆర్ ఎస్ ఎంపీలు తీసుకున్న స్టాండ్ పై పెద్ద చర్చే జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: