జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన చేతకాని తనాన్ని ఒప్పుకున్నట్లేనా ? రాజమండ్రిలో పార్టీ నేతలతో మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాయకత్వ లోపమే కారణమని తానే స్వయంగా చెప్పుకోవటం విచిత్రంగా ఉంది.  జనసేనకు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయినపుడు నాయకత్వ లోపం అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ?


పవన్ చెప్పినదాని ప్రకారం నాయకత్వలోపమే ఓటమికి కారణమైతే తాను చేతకాని వాడినని అంగీకరించటమే.  రాజకీయంగా ఓ విధానమంటూ లేకపోవటం, క్షేత్రస్ధాయిలో పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకోకపోవటం, పొత్తుల విషయంలో చేసిన పొరబాట్లు, అభ్యర్ధుల ఎంపికలో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం లాంటి అనేక తప్పులు జరిగాయి. ఒకసారి చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ఉండటం, మరోసారి చంద్రబాబు, లోకేష్ అవినీతిపై విరుచుకుపడటం లాంటి అనేక చేష్టలతో జనాల్లో నమ్మకం కోల్పోయారు.

 

ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్నా తాను మాత్రం ఏమి పట్టనట్లు ఉండిపోయారు. రెండు రోజులు గట్టిగా జనాల్లో తిరిగితే 15 రోజులు అడ్రస్ ఉండేవారు కాదు. పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుండి పూర్తయ్యేవరకూ జగన్ ఒక్క రోజు కూడా నడక ఆపలేదు. రెండు మూడు సార్లు మాత్రం భారీ వర్షాలు వచ్చినపుడు, రాష్ట్రంలో బంద్ జరిగినపుడు రెండుసార్లు మాత్రమే పాదయాత్రకు విరామం ఇచ్చారు.

 

 చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ అంత స్ధాయిలో పోరాటాలు చేస్తున్నపుడు పవన్ కూడా అదే స్ధాయిలో పోరాటం చేసుంటే జనసేనపై జనాల్లో నమ్మకం వచ్చేది. అలాకాకుండా చంద్రబాబు అవినీతిపై జగన్ పోరాటం చేస్తున్న సమయంలో జగన్ ను టార్గెట్ చేసుకుని పవన్ ఆరోపణలతో రెచ్చిపోయేవారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకోవటం ఏపిలో తప్ప దేశంలో ఎక్కడా జరగలేదు. దాంతో పవన్ ను ఎవరూ నమ్మలేదు. అందుకనే జనసేనను చిత్తుగా ఓడగొట్టటమే కాకుండా పవన్ ను కూడా రెండు చోట్లా ఓడగొట్టారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: