తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఊహించ‌ని తీపిక‌బురు. విప‌క్షాలు, వివిధ వర్గాల నేత‌లు ఇబ్బందులు పెడుతున్న అంశం విష‌యంలో ఊహించ‌ని రీతిలో....హైకోర్టు ద్వారా మ‌ద్ద‌తు ద‌క్కింది. ఆయ‌న నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్ల‌యింది. ఇదంతా కొత్త అసెంబ్లీ నిర్మాణం విష‌యంలో. ఎర్రమంజిల్ ప్రాంతంలో అసెంబ్లీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం ధర్మాసనం విచారణ జరిపింది.  కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకొంటే తప్పేమిటి? అని హైకోర్టు ప్రశ్నించింది. పాత రాష్ట్రాలే కొత్తగా అసెంబ్లీ భవనాలు కట్టుకొంటున్నప్పుడు.. కొత్త రాష్ట్రంలో అభ్యంతరాలు ఎందుకు? అని చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్‌చౌహాన్, జస్టిస్ షమీమ్‌అక్తర్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.

నూత‌న అసెంబ్లీ నిర్మాణంపై వివిధ వ‌ర్గాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే హైకోర్టులో ప‌లు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. దీనిపై ధర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. దశాబ్దాల కిందట నిర్మించిన భవనాలు ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా లేవని ప్రభుత్వం చెప్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త భవనాలు అవసరమని పేర్కొంటుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అసెంబ్లీ భవనం నిర్మిస్తే తప్పేమిటి? పాలనలో ప్రభుత్వం తన మార్కును చూపించాలనుకోవడంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. పాత రాష్ట్రాల్లో కొత్త అసెంబ్లీ భవనాలు కట్టుకున్నారు. ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త భవనాలు కట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత భోపాల్‌లో కంటే పెద్దదైన అసెంబ్లీ భవనాన్ని జైపూర్‌లో నిర్మించారు. తద్వారా తమ ఉనికి, తాము ఇక్కడ ఉన్నాం...అనే సందేశాన్ని పంపారు. భారత స్వాతంత్య్ర పోరాటం స్థాయిలో అనలేం కానీ, భారీస్థాయిలో సుదీర్ఘ పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నారు. అలాంటి రాష్ట్రంలో అసెంబ్లీ భవనం కట్టడం తప్పెలా అవుతుంది? ప్రభుత్వం పాలనతో తమ మార్కును చూపించాలనుకోవడంపై అభ్యంతరాలు ఎందుకు ఉండాలి? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

అసెంబ్లీ నిర్మాణంలో తమకు అభ్యంతరం లేదని, ఖాళీ ప్రదేశంలో అసెంబ్లీ నిర్మించుకోవచ్చని పిటిషనర్ల తరఫు న్యాయవాది నళిన్‌కుమార్ తెలిపారు. హెరిటేజ్ భవనం కూలగొట్టాలనుకోవడంపైనే తమ అభ్యంతరం అని పేర్కొన్నారు. హెరిటేజ్ భవనాలను రక్షించడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకొన్న ధర్మాసనం.. హెరిటేజ్ భవనాల జాబితాలో మార్పులు చేసే అధికారం హెచ్‌ఎండీఏకు ఉన్నదా? లేదా? తెలుపాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, కోర్టు వ్యాఖ్య‌లు టీఆర్ఎస్ పార్టీకి, ప్ర‌భుత్వానికి పెద్ద ఊర‌ట అని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: