గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం ఎపిసోడ్ మ‌రోమారు క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. అయితే, ఇప్పుడు ఆయ‌న దందాల‌తోనో...బెదిరింపుల‌తోనో కాదు...ఆయ‌న ఆస్తుల‌తో. ఆయ‌న‌కు రాజ‌కీయ నాయ‌కులు పోలీసుల‌కు ఉన్న సంబంధాల‌తో. సమాచార హక్కు చట్టం ద్వారా నయీం కేసు వివరాలను  ఫోరమ్ ఫర్ గుడ్‌ గవర్నెన్స్ సంస్థ సేకరించింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... నయీం కేసులో 16 మంది టీఆర్ఎస్ లీడర్ల పేర్లు, 17 మంది పోలీసు అధికారుల పేర్లున్నాయి. మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు కూడా నయీం వ్యవహారాలతో సంబంధాలున్నట్టు పోలీసులు ఆర్‌టీఐ ద్వారా వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య పేరును కూడా పోలీసులు ప్రస్తావించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తుడు అయిన నయీం ఎన్‌కౌంటర్ జరిగి మూడేళ్లు అవుతున్న సంగ‌తి తెలిసిందే. న‌యీంతో సంబంధాలు, ఆయ‌న ఆస్తిపాస్తుల విష‌యాల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఫోరమ్ ఫర్ గుడ్‌ గవర్నెన్స్ సంస్థ ఎపిసోడ్‌ ఇంతవరకు ఈ కేసు పురోగతి ఏంటి? అని ఆర్‌టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించింది. దీనికి పోలీసులు సమాచారాన్ని అందించారు. మాజీ ఎమ్మెల్సే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సహా కొందరు మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లకు ఈ కేసుతో సంబంధం ఉందని ఆర్టీఐ స‌మాచారం తెలిపింది. డీఎస్పీలు శ్రీనివాస్, సాయిమనోహర్ రావు, శ్రీనివాసరావు, ప్రకాష్ రావు, వెంకటనర్సయ్య సహా ఇన్స్ పెక్టర్లు మస్తాన్, శ్రీనివాస రావు, మాజీద్, వెంకట్ రెడ్డి, వెంకట సూర్యప్రకాష్, రవికిరణ్ రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేందర్ గౌడ్ , దినేష్, సాధిఖ్ మియా పేర్లను ప్ర‌స్తావించారు 


కాగా, ఆర్టీఐకి పోలీసులు అందించిన‌ స‌మాచారం నిపుణులతో విశ్లేషించిన తర్వాత తమకు ఏడు, ఎనిమిది అభ్యంతరాలు కనిపించాయని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌తినిధి ప‌ద్మ‌నాభ‌రెడ్డి అన్నారు. నయీం ఇంట్లో డబ్బు దొరికినప్పుడు మిషన్లు పెట్టి లెక్కించారు.. మరి రూ.3 లక్షలే దొరికాయని చెబుతున్నారు... మిగతా డబ్బు ఏమైనట్టు అని ప్రశ్నించారు. నయీంపై 250 కేసులు చూపిస్తున్నారు... మరి నయీం ఇన్ని తప్పులు చేసినంత వరకు పోలీసులు ఏం చేశారు. అంటే, కేసులు బుక్ చేయడం.. విత్ డ్రా చేయడం మళ్లీ బుక్ చేయడం చేశారని.. ప్రజల భూములు, ప్లాట్లు లాక్కోవడం వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా, ఈ విష‌యంలో స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గాలని ఆయ‌న డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: