ఈనెలలో భర్తీ కానున్న మూడు ఎంఎల్సీ పదవుల కోసం పార్టీలో పెద్ద ఎత్తున నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా గెలిచిన కారణంగా ముగ్గురు ఎంఎల్సీలు రాజీనామాలు చేశారు. ఇందులో వైసిపి తరపున ఇద్దరు ఎంఎల్సీలుండగా టిడిపి తరపున ఒక ఎంఎల్సీ ఉన్నారు.

 

ఆ మూడు స్ధానాల భర్తీ కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 7వ తేదీ నుండి ప్రక్రియ మొదలవుతుంది. 26వ తేదీన ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్వరలో భర్తీ అవ్వనున్న మూడు ఎంఎల్సీలు కూడా ఏకపక్షంగా వైసిపికే దక్కుతాయనటంలో సందేహం లేదు.

 

వైసిపి తరపున ఎంఎల్సీలుగా ఉన్న ఆళ్ళ నాని, కోలగట్ల వీరభద్రస్వామి తో పాటు టిడిపి తరపున కరణం బలరామ్ ఎంఎల్సీలుగా రాజీనామా చేసిన  విషయం తెలిసిందే. ఎలాగూ మూడు స్ధానాలు వైసిపికే దక్కుతాయి కాబట్టి నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టేశారు. కాకపోతే ఇప్పటికే మూడు స్ధానాల్లో ఎవరిని నియమించాలో జగన్ నిర్ణయించేశారని సమాచారం.

 

మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని రేపల్లెలో పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణకు ఓ స్ధానం ఖాయం. ఎందుకంటే ఎంఎల్ఏగా ఓడిపోయినా జగన్ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాబట్టి ఒకస్ధానం మోపిదేవికి ఇచ్చి తీరాల్సిందే. అలాగే మిగిలిన రెండు స్ధానాల్లో హిందుపురంలో ఓడిపోయిన మొహ్మద్ ఇక్బాల్ కు కానీ లేదా చిలకలూరిపేటలో టికెట్ ను త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ కు గాని దక్కే అవకాశాలున్నాయి.

 

ఇక మూడో స్ధానం కాపులకు కేటాయించాలని నిర్ణయిస్తే అది ఆమంచి కృష్ణమోహన్ కు దక్కే అవకాశం ఉందని సమాచారం. లేకపోతే మొన్నటి ఎన్నికల్లో పోటికి దూరంగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దక్కే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇవికాకుండా స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన దాదాపు ఏడు స్ధానాలు అందుబాటులోకి వస్తాయి. లోకల్ బాడి ఎన్నికలు జరగ్గానే భర్తీ అయ్యే స్ధానాలన్నీ కూడా వైసిపికే దక్కే అవకాశం ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: