సామాన్య ప్రజల జీవితాలకు అద్దం పట్టే కథనాలు రాసిన వాడే జర్నలిస్టు.
మారుమూల ప్రజల కష్టాలను , బతుకు వెతలను ప్రపంచం ముందు నిజాయితీగా,ధైర్యంగా ఫోకస్‌ చేసిన ఎన్డీటీవీ జర్నలిస్టు రవీశ్‌ కుమార్‌ కి ఈ ఏడాది రామన్‌ మెగసెసె అవార్డు వరించింది.
జనమే తన జర్నలిజం అని నిరూపించి, ఈ రోజుల్లో మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా వదిలేసిన బాధ్యతను రవీశ్‌ ఆచరించి చూపాడు.


'' జర్నలిజం సాహసం వంటిది. జీతంతో పాటు జీవితాల్ని మార్చే అవకాశం ఇస్తుంది. జర్నలిస్టులు విషం వెదజల్లని వార్తలు అందించాలి. వీక్షకుల్లో ఆత్రుత పెంచేలా వార్తలకు రంగులు పులమొద్దు.సామాన్యులు తమ సమస్యలను ప్రభుత్వం ముందుంచుతారని మీడియాను నమ్ముకుంటారు. వారి నమ్మకాన్ని నిజం చేయడమే పాత్రికేయుల కర్తవ్యం.'' అని మెగసెసె అవార్డు పొందిన సందర్భంగా రవీశ్‌ కుమార్‌ అన్నారు.


ఎవరీ రవీశ్‌..?
జిత్వార్‌పూర్‌ గ్రామం (బిహార్‌లో)కి చెందిన రవీశ్‌ ప్రముఖ న్యూస్‌ చానల్‌ ఎన్డీటీవీలో ఫీల్డ్‌రిపోర్టర్‌గా, 1996లో పాత్రికేయ జీవితం ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఛానల్‌కి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా ఎదిగారు. ఆ ఛానల్‌లో ప్రసారమయ్యే రవీశ్‌కుమార్‌ కార్యక్రమం ప్రైమ్‌ టైమ్‌ షో ఎంతో ప్రజాదరణ పొందింది. ప్రజాసమస్యలు, వారి నిజమైన జీవన పరిస్థితులను నిర్భీతిగా ఈ కార్యక్రమంలో ఆయన చర్చిస్తుంటారు. నైతికత, నిబద్ధతతో తన వృత్తి ని నిర్వహిస్తూ, ప్రజాసమస్యలను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. అనేక ఒత్తిడులు మధ్య , మీడియా వాతావరణంలో పనిచేస్తూ, తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు.


అవార్డు ఎందుకిచ్చారంటే... ?
''   అభూత కల్పనలు కాకుండా, రియల్‌ రిపోర్టింగ్‌ పద్ధతులను ఆచరిస్తూ, నైతికతతో తన ఉద్యోగాన్ని నిర్వహించి , నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకుగాను రవీశ్‌ ను ఈ పురస్కారానికి ఎంపిక చేశాం. ప్రజాగళాన్ని వినిపించడమే నిజమైన జర్నలిజం... '' అని, మెగసెసె ఫౌండేషన్‌ వెల్లడించింది.
ఇండియాలోని అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో రవీశ్‌ ఒకరని ఫౌండేషన్‌ ప్రశంసించింది. రవీశ్‌తో పాటు మయన్మార్‌ జర్నలిస్టు కో స్వీ విన్‌, థాయిలాండ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆంగ్‌ఖానా నీలప్‌జిత్‌, దక్షిణ కొరియాకు చెందిన సామాజిక కార్యకర్త కివ్న్‌ జోంగ్‌-కి, ఫిలిప్పీన్స్‌కు చెందిన రేముండో పూజంతే కయబ్యాబ్‌కు కూడా ఈ అవార్డు లభించింది.


నిజాల్ని నిర్భయంగా...
రవీశ్‌ రామన్‌ మెగసెసె అవార్డుకు ఎంపిక కావడంపై పలువురు  ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను భయం లేకుండా అధికారంలో ఉన్న వాళ్లకు రవీశ్‌ చూపెట్టగలిగారని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ఫేస్‌బుక్‌ టైం లైన్‌లో ప్రశంసించారు.
'' రవీశ్‌ అట్టడుగు ప్రజల సమస్యలను తీసుకొని పకడ్బందీగా స్టడీ చేసి, దాని తీవ్రతను అటు ప్రజలు,ఇటు ప్రభుత్వం గుర్తించేలా ప్రజెంట్‌ చేస్తారు.'' అని సీనియర్‌ పాత్రికేయులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: