జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పి మొదలైంది. ఈనెలఖరులో భర్తీ చేయాల్సిన మూడు ఎంఎల్సీల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తోంది. ఎప్పుడైతే మూడు స్ధానాలు వైసిపికే వస్తాయని తేలిపోయిందో వెంటనే ఆశావహులు పెరిగిపోతున్నారు.  ఎంఎల్ఏల కోటాలో భర్తీ కావాల్సిన స్ధానాలే కాబట్టి అసెంబ్లీలో సంఖ్యా బలం రీత్యా మూడు వైసిపి ఖాతాలోనే పడతాయి.

 

ఒకేసారి మూడు ఎంఎల్సీలు భర్తీ అవుతుండటంతో నేతల్లో ఆశలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయిన వారు, పోటీ చేసేందుకు అవకాశం దక్కని వాళ్ళు తమకు ఎంఎల్సీగా అవకాశం ఇవ్వాల్సిందిగా జగన్ పై ఒత్తిడి మెదలుపెట్టారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భర్తీ అయ్యేవి మూడు సీట్లే అయినా నిజానికి ఇప్పటికే ఒకస్ధానం రిజర్వయిపోయింది.

 

మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో పోటీచేసిన మోపిదేవి వెంకటరమణ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మోపిదేవి ఓడిపోయినా జగన్ మాత్రం ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంటే మూడు స్ధానాల్లో ఒకటి మోపిదేవికి రిజర్వయిపోయినట్లే లెక్క. ఇక మిగిలిన రెండు స్ధానాలను ఎవరికి కేటాయిస్తారన్నదే సమస్య.

 

మిగిలిన రెండు స్ధానాలకు పార్టీ నేతల మధ్య భారీ పోటీ మొదలైందట. పోయిన ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయినందుకు చిలకలూరిపేట నేత మర్రి రాజశేఖర్ ను ఎంఎల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పారు. అలాగే హిందుపురం అసెంబ్లీలో ఓడపోయిన మోహ్మద్ ఇక్బాల్ ను ఎంఎల్సీ చేస్తానంటూ బహిరంగంగానే ప్రకటించారు.

 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి, అమలాపురం మాజీ ఎంపి పండుల రవీంద్ర, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, సినీనటుడు ఆలీ,  కర్నూలు జిల్లా నేత చల్లా రామకృష్ణారెడ్డి, జయసుధ, మోహన్ బాబు పేర్లు కూడా ప్రచారంలో ఉంది. మరి ఉన్న రెండు స్ధానాలు ఎవరికి దక్కుతాయో తెలీదు కానీ జగన్ పై మాత్రం ఒత్తిడి పెరిగిపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: