స‌రిహ‌ద్దు రాష్ట్రమైన క‌శ్మీర్‌పై పాకిస్థాన్ కొత్త కుట్ర చేస్తోంది. రాష్ట్రంలో ఉగ్ర‌దాడుల‌కు భారీ స్కెచ్ వేసింది.అమర్‌నాథ్ యాత్రికులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశముందని సైన్యం ప‌సిగ‌ట్టింది. నిఘా వర్గాల సమాచారం మేరకు గత ఐదు రోజులుగా అమర్‌నాథ్ యాత్ర పొడవునా తనిఖీలు నిర్వహించి మందుపాతరలను, పేలుడు పదార్థాలను, తుపాకులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. సైన్యం ప్రకటనపై స్పందించిన జమ్ముకశ్మీర్ గవర్నర్ కార్యాలయం భక్తులు వెంటనే యాత్రను రద్దు చేసుకొని వీలైనంత త్వరగా వెనక్కి వచ్చేయాలని సూచించింది. ఈ ప్రకటనల నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఈ నిర్ణ‌యాల‌ను ఆ రాష్ట్రంలోని రాజ‌కీయ పార్టీల నేత‌లు త‌ప్పుప‌ట్టారు. 


ఆర్మీ హెచ్చ‌రిక‌లు, రాష్ట్రంలోని ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతంగా సాగుతున్న అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడానికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, ఆ దేశ సైన్యం కుట్ర పన్నుతున్నట్లు మూడు, నాలుగు రోజుల కిందట సమాచారం అందిందని తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించడానికి పాకిస్థాన్, ఆ దేశ సైన్యం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ``మాకు అందిన స‌మాచారంతో మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్లే రెండు మార్గాలైన బాల్తాల్, పెహల్‌గామ్‌లలో విసృత్తంగా తనిఖీలు జరిపాం. మందుపాతరలు, తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. వీటిలో ఒక మందుపాతర పాకిస్థాన్‌లో తయారైనట్లు గుర్తించాం. దీన్ని బట్టి కశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాక్ పాల్పడుతున్నదని, ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్నదని మరోమారు స్పష్టమైంది`` అని చెప్పారు. 


జూలై 30వ తేదీన గురేజ్ సెక్టార్ వద్ద ముగ్గురు ఉగ్రవాదులను కాల్చివేశామని లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్‌ తెలిపారు. కశ్మీర్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేస్తున్నామని, ఆయా సంస్థల నాయకులను ఏరిపారేస్తున్నామని వెల్లడించారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని కూడా అరెస్టు చేస్తున్నామని పేర్కొన్నారు. దాదాపు 83% ఉగ్రవాదులకు భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన చరిత్ర ఉన్నదని వివరించారు. కశ్మీర్‌లోని తల్లులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రూ.500 కోసం ఈ రోజు మీ కుమారుడు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వి ఉండొచ్చు. కానీ రేపు మీ కుమారుడు ఉగ్రవాదిగా మారే అవకాశం ఉంది. కాబట్టి కుమారుల పట్ల అప్రమత్తంగా ఉండండి` అని ధిల్లాన్ సూచించారు.

ఇదిలాఉండ‌గా,  జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ గవర్నర్ కార్యాలయం ఆదేశాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉన్నాయని చెప్పారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ ప్రజల్లో మానసిక ఆందోళన కలిగించడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. నిత్యావసరాలను నిల్వ చేసుకునేలా ప్రజలను పురిగొల్పుతున్నారని మండిపడ్డారు. రాజకీయ నేతగా మారిన మాజీ యువ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ మాట్లాడుతూ భద్రతా దృష్ట్యా యాత్రికులు వెనక్కి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఆదేశాలనే స్థానిక ప్రజల కోసం కూడా రూపొందిస్తున్నారా? అని ఆయన పశ్నించారు. కాగా, రాష్ట్రంలోని ప‌రిణామాల‌తో క‌శ్మీరీలు వ‌ణికిపోతున్నారు. అమర్‌నాథ్ యాత్రికులు యాత్రను రద్దు చేసుకొని వెనక్కి వెళ్లాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో భయాందోళన వాతావరణం నెలకొంటుంది. నిత్యావసరాలను నిల్వ చేసుకుంటున్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకోవడానికి జనాలు భారీగా పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూ కట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: