ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వ చట్టాలను ఏమాత్రం లెక్క చేయటం లేదని సమాచారం. ఆకాశమంత ఎత్తున పెరిగిపోయిన ఫీజులను తగ్గిస్తామని ఈమధ్యనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ చట్టాన్ని కూడా రూపొందించింది. చట్టం ఉద్దేశ్యం ఏమిటంటే ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులను తగ్గించటం, పేద విద్యార్ధులకు 25 శాతం ఉచితంగా సీట్లు ఇప్పించటం. అదే సమయంలో చదువుకునే విద్యార్ధులను ప్రోత్సహించేందుకు ’అమ్మఒడి’ పథకంలో తల్లులకు ప్రోత్సాహకాలివ్వటం.

 

జగన్ హామీలు బాగున్నాయి. అసెంబ్లీలో చట్టం చేయటం ఇంకా బాగుంది. కానీ అమల్లోకి వచ్చేసరికే సమస్యలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వం చేసిన చట్టాన్ని చాలా ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు పాటించటం లేదట. చట్టం దారి చట్టానిదే..తమ పద్దతి తమదే అన్నట్లుగా యాజమాన్యాలు తమిష్టం వచ్చిన ఫీజులను వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

అసెంబ్లీ చట్టాలు చేయటం తేలికే కానీ చేసిన చట్టాలు క్షేత్రస్ధాయిలో అమలవుతున్నాయా లేదా అని చూడటమే కష్టమన్న విషయం జగన్ మరచిపోయినట్లున్నారు. ఎందుకంటే మొన్నటి వరకూ చంద్రబాబునాయుడు సర్కారులోని చాలామంది అధికారులు ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలతో కుమ్మకైపోయారు. దాని ఫలితంగానే ప్రైవేటు యాజమాన్యాలది ఇష్టారాజ్యంగా మారిపోయింది.

 

అలాంటిది ఒక్కసారిగా చట్టాలు చేసేసి ప్రైవేటు యాజమాన్యాల విషయం కఠినంగా ఉండంటంటే అధికారులు ఉండలేరు.  చట్టాలు అమలయ్యేట్లు చూడటంలో యంత్రాంగానికి అనేక మోహమాటాలు అడ్డు వస్తాయి. దాని ఫలితంగానే విద్యారంగంపై చేసిన చట్టం పూర్తిగా అమల్లోకి రాలేదట. విద్యా సంవత్సరం మొదలైంది కాబట్టి ప్రైవేటు యాజమాన్యాలు తమిష్టప్రకారమే ఫీజులను వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

 

కాబట్టి జగన్ చేయాల్సిందేమిటంటే తమ ప్రభుత్వం చేసిన చట్టం సక్రమంగా అమలయ్యేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఏ స్కూల్లో ఏ తరగతికి ఎంత ఫీజు కట్టాలో తల్లి, దండ్రులకు తెలిసే ఏర్పాట్లు చేయాలి. ప్రతీ స్కూలు దగ్గర ఓ డిస్ల్పే బోర్డు ఏర్పాటు చేయించాలి.  ఫీజుల విషయంలో చట్టాలు చేస్తే సరిపోదని చైతన్యం తెచ్చేందుకు  తల్లి, దండ్రులతో ఎక్కడికక్కడ సంఘాలను ఏర్పాటు చేయాలి. అప్పుడే జగన్ కష్టానికి ఫలితం కనిపిస్తుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: