వైసీపీ సర్కార్ లో నంబర్ టూ ఎవరు. సహజంగానే ఈ ప్రశ్న వస్తుంది. రావాలి కూడా. ఎక్కడైనా బాస్ బిజీగా ఉంటే తరువాత ప్లేస్ లో ఉన్న వారు ముందుకు వచ్చి ఆ వ్యవహారాలను చక్కబెడతారు. ఇది పాలనపరంగా కూడా చాలా అవసరం అయినదే. ముఖ్యంగా సీఎం లు, పీఎం లు విదేశాల్లో ఉన్నపుడు, ఎక్కువ రోజులు వారు ఆఫీస్ బిజినెస్ కి దూరం అయినపుడు నంబర్ టూ గా ఉన్న వారు మొత్తం చక్కబెడతారు. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం లు, డిప్యూటీ పీఎంలు లేకపోయినప్ప‌టికీ సమర్ధులను, సీనియర్లను ఆ పోస్ట్ లోకి తీసుకోవడం ఈ కారణంతోనే.


ఇదిలా ఉండగా వాజ్ పేయ్ ప్రధాని గా  ఉన్న కాలంలో డిప్యూటీ పీఎం ఎల్ కె అద్వాని మొత్తం చక్రం తిప్పేవారు. ఆయన కనుసన్నల్లోనే పాలన అంతా సాగింది. వాజ్ పేయ్ ఆ స్వేచ్చ కూడా ఆయనకు అలా ఇచ్చారు. అంత చక్కటి అనుబంధం వారిది. ఇక వారితో మిగిలిన వారిని పోల్చలేం కానీ తన తరువాత మరొకరు అనగానే మాత్రం ఎందుకో రాజకీయ జీవుల గుండెలు గుభేల్ మంటాయి. ఫలానా వారిని తన తరువాత అంటే వారే ముందుకు తోసుకువస్తారేమోనని భయం కూడా ఉంటుంది.


కేంద్రంలో ఇపుడు మోడీ తరువాత ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు అమిత్ షా. ఆయన హోం మంత్రి. నిజానికి సీనియర్ గా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఉన్నారు. గడ్కరీ కూడా ఉన్నారు. కానీ మోడీ, షా ల సాన్నిహిత్యం వేరుగా  ఉంటుంది. ఇక ఇదే తీరు అన్నింటా కుదరదేమో, జాతీయ రాజకీయలో డిప్యూటీల వల్ల, నంబర్ టూల వల్ల లాభపడ్డవారు ఉన్నారు, అలాగే నష్టపోయిన వారు కూడా  ఉన్నారు.రాజీవ్ గాంధీ క్యాబినేట్లో ఆర్ధిక మంత్రిగా ఉన్న వీపీ సింగ్ నంబర్ టూ గా ఉండేవారు. చివరకు ఆయనే బయటకు వచ్చేసి రాజీవ్ ని సవాల్ చేశారు. రాజీవ్ ని గద్దె దింపేసి మరీ వీపీ సింగ్ పీఎం అయ్యారు.



ఇక తెలుగు రాజకీయాల్లో చూసుకుంటే అన్న నందమూరికి నాదెండ్ల భాస్కర రావు నంబర్ టూ గా ఉండేవారు. చివరికి ఆయనే వెన్నుపోటు పొడిచేశారు. తరువాత కాలంలో అల్లుడు చంద్రబాబు నంబర్ టూ గా ఉండి అన్న గారిని గద్దె దించారు. దాంతో ప్రాంతీయ పార్టీలకు నంబర్ టూలు అచ్చిరావు అంటారు. చంద్రబాబుకు నంబర్ టూలు ఎవరూ లేరు. ఇపుడు జగన్ కు అంతే. వన్ టూ టెన్ ఆయ‌నే. అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నా, సీనియర్ మంత్రులు ఉన్నా కూడా జగనే అన్నీ, జగనే అంతా. ఆయన జెరూసలమ్  టూర్లో  బిజీగా ఉన్నా కూడా అక్కడ నుంచే పాలనా పగ్గాలను అందుకుంటున్నారు. అందివచ్చిన టెక్నాలజీ ఆసరాతో జగన్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏపీ పాలన చేసుకుంటూ పోతున్నారు. సో జగన్ కి నంబర్ టూ అవసరం లేదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: