పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మరోమారు రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. సంకీర్ణ జేడీఎస్ స‌ర్కారు కూలిపోయి బీజేపీ ప్ర‌భుత్వం గ‌ద్దె నెక్కిన‌ప్ప‌టికీ....ఆ ప్ర‌భుత్వం సుస్థిరంగా కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత కుమరస్వామి సంచలన వ్యాఖ్యలు చేయ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలకు ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందన్నారు. మాండ్యలో జేడీఎస్‌ కార్యకర్తలతో సమావేశమైన కుమారస్వామి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.


జేడీఎస్ బ‌లంగా ఉన్న మాండ్య‌లో కుమార‌స్వామి మాట్లాడుతూ, 'త్వరలో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. అనర్హత వేటు పడిన 17 ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. లేదా మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సుధీర్ఘకాలం కొనసాగదని నేను భావిస్తున్నాను` అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.  దీంతో క‌ర్ణాట‌క సంకీర్ణ స‌ర్కారుపై మ‌ళ్లీ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 


కాగా, మాండ్య‌లో తాజా,మాజీ ముఖ్య‌మంత్రుల ప‌ర్య‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యెడీయూరప్ప అనంత‌రం సొంతూరులో పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి మాండ్యలోని ఆయన సొంతూరు బూకనకరెకు వెళ్లారు. అనంతరం ఆ గ్రామంలో గల సిద్ధలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యెడ్డీ మాట్లాడుతూ.. 'నాకు జన్మనిచ్చిన గ్రామంలో పర్యటించడం నా బాధ్యత. నేను ఇక్కడే పుట్టి.. పెరిగాను. ఈ గ్రామంలో ఉన్న మా ఇంటికి వెళ్లడంతో పాటు ఆలయాన్ని కూడా దర్శించుకుంటాను' అని ఆయన చెప్పారు. యడీయూరప్ప రాకతో ఊరులో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రిని చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. కాగా, తాజాగా ఆ వెంట‌నే కుమార‌స్వామి ప‌ర్య‌టించ‌డం గ‌మ‌నార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: