అదే దూకుడు. అదే డైనమిక్ ఫిగర్. తమ్మినేని సీతారాం  గురించి శ్రీకాకుళం జిల్లాలో ఇదే చెప్పుకుంటారు. ఆయన కండల వీరుడని, 1970లలో కుస్తీల  పోటీలో  విజేత అని చాలా మందిని తెలియదు. ఇక ఆయన రాజకీయాల్లో కూడా గండర గండడు. ఆ విషయం మాత్రం చాలా మంది కంటే చంద్రబాబుకు బాగా తెలుసు. టీడీపీలో తమ్మినేని ప్రస్థానం అంతా ఆయన అనుకున్నట్లుగానే సాగింది. ఎక్కడా రాజీ అన్న మాటే లేదు. బాబుది తప్పు అనుకుంటే ధిక్కరించి మరీ చెప్పగలిగిన దిట్ట ఆయన.


ఇక జగన్ కి తమ్మినేనిలో అదే నచ్చి ఉంటుంది. తనలాగే మొండిగా అనుకున్నది పట్టుదలగా చేసే నేతగా తమ్మినేని ఉండడం జగన్ని ఆకట్టుకుందేమో. ఏపీకి స్పీకర్ ని చేసి మొత్తం అసెంబ్లీని చేతిలో పెట్టేశారు. తొలిరోజునే జగన్ ఓ మాట అన్నారు. తాను ఒక్క ఎమ్మెల్యేను కూడా తీసుకోను, ఏ పార్టీ వారు అయినా తమ పార్టీలో చేరాలంటే పదవికి రాజీనామా చేయాల్సిందే. ఇక వేరే పార్టీలో ఎవరు  చేరినా, జెండా మార్చినా కూడా వెంటనే అనర్హత వేటు వేసేయండని స్పీకర్ తమ్మినేనికి సభాముఖంగా జగన్ నివేదించారు.


దీంతో తమ్మినేని తాను నమ్మిన సిధ్ధాంతాలను అమలుకు రెడీ అంటున్నారు. ఏ పార్టీ నుంచి అయినా గోడ దూకుళ్లు సాగాయో వారి తోక కత్తిరిస్తానని వెంటనే వేటు వేస్తానని తమ్మినేని చెబుతున్నారు. లేటెస్టుగా  మీట్ ది ప్రెస్ లో ఆయన అన్న ఈ మాటలు నిజంగా బీజేపీ గుండేల్లో గునపాలే దించేశాయి. ఏపీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు  ఉంటే అందులో కొందరు బీజేపీ వైపు మనసు లాగి ఉన్నారు. అటువంటి వారిని గోడ దూకించి తామూ అసెంబ్లీలో ఉన్నామని అనిపించుకోవడానికి బీజేపీ గట్టిగానే ట్రై చేస్తొంది.


జగన్ అన్న మాటలతోనే సగం ఆశలు ఆవిరి అయిపోతే తాజాగా తమ్మినేని వేటు వేస్తాను అంటూ కత్తి పట్టుకుని నిలుచున్న ఫోజు చూసి బీజేపీ హడలిపోతోంది. ఇక ఆ  పార్టీలో చేరుదామని చూసే తమ్ముళ్లకు కూడా ఇది మింగుడు పడని వ్యవహారమే. ఎందుకొచ్చిన తంటా ఉన్న పార్టీలోనే ఉంటే పోలా అనుకుని తమ్ముళ్ళు నెమ్మదిస్తూంటే వారిని ఎలా గూటికి చేర్చాలని బీజేపీకి పెద్ద సమస్యే వచ్చిపడింది. ఒక పార్టీ  నుంచి మరో పార్టీకి విలీనం చేసుకున్న కేసులు తన దాకా వస్తే మాత్రం వెనక ముందూ చూడకుండా అందరినీ డిస్ క్వాలిఫై చేస్తానంటున్న  తమ్మినేని ఇపుడు బీజీపీ కంట్లో నలుసుగా మారారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: