ఆప‌రేష‌న్ క‌శ్మీర్‌ను బీజేపీ పెద్ద‌లు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకుపోతున్నారు. అత్యంత ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లును ఆమోదించుకుంటున్న ఈ ద్వ‌యం తాజాగా లోక్‌స‌భ‌లో బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది. సోమ‌వారం పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ లేని రాజ్యసభలో బిల్లు ప్ర‌వేశ‌పెట్టి ఆమోదం పొందించిన అమిత్‌షా తాజాగా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బీజేపీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఉన్న నేప‌థ్యంలో...ఇక్క‌డ బిల్లు నెగ్గ‌డం ఇబ్బందిక‌ర‌మేం కాద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 


రాజ్యసభలో జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుపై స్లిప్పులతో  ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు మద్దతుగా 125, వ్యతిరేకంగా 61 మంది సభ్యులు ఓటేశారు. బిల్లుపై  మొదట ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. సాంకేతిక లోపం తలెత్తడంతో.. తిరిగి స్లిప్పులతో ఓటింగ్ చేపట్టారు.ఓటింగ్ అనంతరం రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది. తాజాగా లోక్‌స‌భ‌లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. దీనిపై ప్ర‌భుత్వం త‌న ఉద్దేశాల‌ను వివ‌రిస్తుండ‌గా విప‌క్షాలు త‌మ అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేస్తున్నాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ రభస సృష్టించారు. బిల్లుపై కాంగ్రెస్‌ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపి ఆధిర్‌ రంజన్‌ మాట్లాడుతూ కాశ్మీర్‌ సమస్య ఐక్యరాజ్యసమితిలో ఉందని, అది అంతర్గత సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న అనుమానాలన్నీ తీర్చాలని రంజన్‌ డిమాండ్‌ చేశారు.  కాంగ్రెస్‌ ఎంపి ఆధిర్‌ రంజన్‌ చౌధురి మాట్లాడుతున్నప్పుడు బిజెపి ఎంపిలు గందరగోళం సృష్టించారు.


ఇదిలాఉండ‌గా, ఈ బిల్లుతో కాంగ్రెస్ పార్టీలో లుక‌లుక‌లు బ‌హిర్గ‌తం అవుతున్నాయి. రాజ్యసభలో పార్టీ వాణిని గట్టిగా వినిపిస్తున్న భువనేశ్వర్ కాలిటా.. 370 అధికరణంపై కాంగ్రెస్ పార్టీ వైఖరితో విభేదించారు. అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాలిటా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జాతి భావోద్వేగాలు, మానసిక స్థితికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. కశ్మీర్‌పై విప్ జారీ చేయాలని కాంగ్రెస్ కోరింది. కానీ నిజంగా జాతి మానసిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ విప్ యావత్ దేశానికి వ్యతిరేకం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం ఆత్మహత్యాసాదృశ్యం. అందులో నేను భాగస్వామిని కాలేను. పార్టీని కాంగ్రెస్ నాయకత్వం ధ్వంసం చేస్తున్నది. కాంగ్రెస్ పతనాన్ని ఎవరూ నిలువరించలేరు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: