రాష్ట్ర  సమస్యల విషయమై ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రెండ్రోజుల పర్యటనలో రాష్ట్రపతి ప్రధానిని కలవనున్నారు. సీఎం అయ్యాక తొలిసారి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలవబోతున్నారు జగన్. విభజన సమస్యలతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు కేంద్రానికి వివరించనున్నారు. రాష్ట్ర సమస్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి కేంద్ర పెద్దలతో చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. మధ్యాహ్నం హోంమంత్రి అమిత్ షా తోనూ సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు.ఈ సమావేశాల్లో విభజన సమస్యల పరిష్కారం కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధుల వంటి అనేక విషయాలపై చర్చించనున్నారు.



ఏపీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలకు త్వరగా పరిష్కారం చూపాల్సిందిగా కోరనున్నారు. ముఖ్యంగా పోలవరం అంశాన్ని మోదీ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు సీఎం జగన్. ప్రాజెక్ట్ టెండర్ లను రద్దు చేసిన విషయాన్ని వివరించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ప్రధాని ముందుంచనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో రివర్స్ టెండరింగ్ నిర్ణయం తీసుకున్నామని తెలియజేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా టెండర్ లు పిలవాల్సి ఉన్నందున జాప్యం లేకుండా అనుమతులిస్తే నవంబర్ నుంచి తిరిగి పనులు మొదలు పెడతామన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళే అవకాశముంది.



అంతేకాదు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను కూడా త్వరగా విడుదల చేయాలని కోరే అవకాశముంది. ఇటు పీపీఏల అంశాన్ని మోదీ వద్ద జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. టీడీపీ గత ఐదేళ్ళ పాలనలో చేసిన విద్యుత్ ఒప్పందాల్లో భారీగా అవినీతి జరిగిందని లెక్కలతో సహా మోదీకి వివరించనున్నారని సమాచారం. ప్రస్తుతం వున్న పీపీఏలని యథాతథంగా కొనసాగిస్తే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుందన్న అంశాన్ని ప్రస్తావించనున్నారు జగన్. కేంద్రం కూడా పీపీఏల సమీక్షలు సానుకూల దృష్టితో చూడాల్సిన అవసరముందని ప్రధానికి వివరించనున్నారు జగన్. అమిత్ షా తో జరిగే సమావేశంలో ముఖ్యంగా షెడ్యూల్ 9,10 ఆస్తులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించనున్నారు.



సమస్యలను పరిష్కరించుకునే దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చూపుతున్న చొరవ ఇటీవల జరిపిన భేటీ విశేషాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళనున్నారు. ఇదే క్రమంలో నియోజక వర్గాల పునర్విభజన వంటి అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. రెండు రోజుల పర్యటనలో రెండో రోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు సీఎం జగన్. ఆ తర్వాత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తోను భేటీ కానున్నారు. జగన్ సీఎం అయ్యాక వెంకయ్యనాయుడును కలవడం ఇదే మొదటి సారి. ఇక రెండో రోజు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో జగన్ సమావేశం అవుతారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యే అవకాశముంది.



ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు మరీ ముఖ్యంగా ఆర్థిక లోటు గురించి చర్చించే అవకాశాలున్నాయి. ఆర్థిక లోటు భర్తీ విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య లెక్కల విషయంలో పంచాయితీ నడుస్తున్న, ప్రస్తుత రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని కోరనున్నారు జగన్. విద్యా, వైద్య రంగాల్లో తీసుకురావాలనుకుంటున్న సంస్కరణల గురించి వివరిస్తారని తెలుస్తుంది. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు ఎఐబిబి వంటి సంస్థలు రుణాలను నిలిపివేసిన విషయాలను నిర్మలా సీతారామన్ తో జగన్ ప్రస్తావించే సూచనలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: