తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు త‌న‌దైన శైలిలో రాజ‌కీయ  ప‌రిణామాల‌పై స్పందించారు. విస్తారంగా కురిసిన వ‌ర్షాల‌తో స‌మృద్ధిగా ఉన్న గోదావ‌రి నీటి వీక్షించేందుకు హెలీకాప్ట‌ర్‌లో ప్ర‌యాణించిన కేసీఆర్ ధ‌ర్మపురిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి, రాజ‌కీయ‌, ప‌రిపాల‌న సంబంధ‌మైన అంశాల‌పై స్పందించారు. ``గోదావరి నదిలో దాదాపు 100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచింది. ఎవరూ ఊహించని ఘనత ఇది. అనుకున్న దాని కంటే బ్రహ్మాండంగా ప్రాజెక్టులు తయార‌య్యాయి. తెలంగాణ భవిష్యత్‌ కోసం శాశ్వత సాగునీటి వనరులు సమకూరుస్తున్నాం. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉంది. గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోంది` అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.


కృష్ణాలో నీటి లభ్యత తక్కువగా ఉందని,  గోదావరి తప్ప తెలంగాణ‌కు మరో మార్గం లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  ``కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా లభించే నీళ్లు 400 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. నెలకు 60 టీఎంసీల చొప్పున 6 నెలలపాటు నీటిని ఎత్తిపోస్తున్నాం. రామగుండం నుంచి అదనంగా 4వేల మెగావాట్ల కరెంట్‌ వస్తుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ప్రతీ రోజు 3 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు ప్రతీరోజు 2 టీఎంసీల నీళ్లు వస్తాయి. ధర్మపురి దగ్గర ఏడాది పొడవునా గోదావరి నిండుగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం నీటి స‌ర‌ఫ‌రా సంబంధించిన స‌మ‌స్య‌లు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం`` అని అన్నారు.


కాళేశ్వ‌రం ప్రాజెక్టు స‌హా తెలంగాణ ఫ్ర‌భుత్వం యొక్క నిర్ణ‌యాల‌పై ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యాల‌ను త‌ప్పుప‌ట్టిన లోక్‌స‌త్తా నేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణపై ఈ సంద‌ర్భంగా కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. ప్రాజెక్టుల విష‌యంలో కొంద‌రివి అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌ల‌న్నారు. ``జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ఎవ‌రు? ఆయ‌న‌కు అనేందుకు ఏం అర్హ‌త ఉంది?  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ వ్య‌తిరేకించారు. ఆనాడు అడ్డుప‌డిన వ్య‌క్తి ఇప్ప‌డు మాట్లాడ‌టంలో అర్థం ఏముంది? ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చును త‌ప్పుప‌ట్టేవారు ఖ‌ర్చు చేసిన మొత్తం రైతుల కోసం ఉద్దేశించింది కాదా?  దానిపై ఎందుకు స్పందించ‌డం లేదు?`` అని మండిప‌డ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: