బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ (67) మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.  మంగళవారం రాత్రి అస్వవ్థతకు గురయ్యారు. ఆమెను కుటుంబసభ్యులు ఎయిమ్స్ కు తరలించారు. సుష్మాస్వరాజ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే  కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ వెంటనే ఎయిమ్స్ కు చేరుకొన్నారు.

ఎయిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.  ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా కనిపించే సుష్మా స్వరాజ్ ఇక లేరని..తిరిగి రారని తెలిసి యావత్ ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

లాయర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన అనంతరం రాజకీయాల్లో చేరి, అనతికాలంలోనే దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌గా మంచి మనసున్న నాయకురాలిగా ప్రజలకు దగ్గరయ్యారు. 


చనిపోవడానికి ముందు ఆమె చివరిసారి ప్రధాని నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు లోక్‌సభలో ఆమోద ముద్ర పడిన వెంటనే సుష్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాత్రి ఏడున్నర సమయంలో ఆమె ట్వీట్ చేశారు. ఇది చూడడం కోసమే తాను జీవితకాలం ఎదురుచూశానని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


రాజకీయ ప్రముఖుల సంతాపం..
సుష్మ స్వరాజ్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని మోదీ ట్వీట్ చేశారు. సుష్మను అభిమానించే వారికి ఇది ఎంతో దురదృష్టకరమైన రోజని, దేశానికి ఆమె చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.


తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన గొప్ప నేత సుష్మ స్వరాజ్ అన్న మోదీ.. ఆమె మంచి వక్త, ఉత్తమ పార్లమెంటేరియన్ అని ప్రశంసించారు. 


సుష్మ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: