దేశ అర్ధిక, సామాజిక రంగాల్లో చేనేత పరిశ్రమ భాగస్వామ్యాన్ని తెలిపేందుకు, చేనేతలకు ప్రచారం కల్పించి, నేతన్నల అదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో అగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది.
చేనేత చీరలను కట్టుకుంటే తేజస్సుతో కూడిన నిండుతనం వచ్చేస్తుంది. భారతీయ  సంప్రదాయాలకు ఈ చీర అద్దం పడుతుంది. అయితే, ఈ నేత వెనుకున్న నేతకార్మికుల బతుకు చిత్రం పై ఒక అధ్యయనం.

'' చిక్కులుగా ఉన్న దారాల నుంచి ఒక్కో పోగును ఆధారం చేసుకొని, రాట్నంపై వడుకుతూ, అలా వడికిన దారం మొత్తం కండెలకు చుట్టి, ఆ దారమంతా ఆసు పోస్తారు. ఆసుకు రంగులు అద్దడానికి ముందు డిజైన్లను ఎంపిక చేసుకుంటారు. ఆ డిజైన్‌ను ఆసుపై మార్కు చేస్తారు, గుర్తించిన ప్రదేశాలు మినహా మిగతా ఆసుకు రబ్బర్లు చుట్టి, వేడి చేసిన రంగునీటిలో రంగులద్దుతారు. దాన్ని ఆరబెట్టి , రబ్బర్లు విప్పుతారు. ఆ తరువాత దాన్ని మగ్గంపై నేస్తారు. మగ్గం నేసే క్రమంలో మా చేతులు, కాళ్లు పని చేయాల్సిందే.. ఏ ఒక్కటి ఆగినా చీర రాదు...'' అని , వివరించారు నల్గొండ జిల్లా,వెల్లంకి నేతకార్మికురాలు గంజి ఉమ,.


చేనేతలంటే కేవలం చీరలే కాదు;
చేనేతలంటే కేవలం చీరలే కాదు, మగవారికి వివిధరకాల పట్టు చొక్కాలు, కుర్తాలు, ధోవతులు, లుంగీలే కాదు , వీటి వెనుక కార్మికుల కష్టాలున్నాయి. ఒక్కో సారి రోజు గడవని సందర్భాలున్నాయి, వీరిని పట్టించుకోని సర్కారీ నిర్లక్ష్యం ఉంది.
'' చేనేత సంఘాలకి సొంత షాపులు కానీ, పెట్టుబడులు కానీ లేవు. ప్రభుత్వ మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించదు. చేనేత వస్త్రాలకు ప్రభుత్వం సరైన మార్కెటింగ్‌ కల్పించకపోవడం వల్ల చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత వస్త్రాలు ప్రపంచ ఖ్యాతి పొందినా అందుకు తగ్గట్లుగా మార్కెటింగ్‌ నిర్వహణ లేదు.'' అని అవేదన వ్యక్తం చేస్తున్నారు. పోచంపల్లికి చెందిన కొందరు కార్మికులు.


చేతి నిండా పని దొరకాలంటే? ;
'' చేనేత వస్త్రాలకు సంబంధించిన ఎక్స్‌పో పెద్ద నగరాల్లో నిర్వహిస్తే చేనేత వస్త్రాలకు డిమాండ్‌ పెరుగుతుంది. దాంతో పాటు సప్లయి పెరుగుతుంది. చేనేత కార్మికులకు చేతి నిండా పని దొరకడానికి అవకాశం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకొని నేసిన చీరను నేత కార్మికుల దగ్గర దళారులు రెండు వేలకు కొని హైదరాబాద్‌ మార్కెట్‌లో ఇరవై వేలకు అమ్ముతున్నారు. కార్యికుల కష్టం ఇలా దోపిడీకి గురవుతుంది. దీనిని ప్రభుత్వం నిలవరించాలంటే వారికి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి'' అంటారు చేనేత కార్మికుల పై అధ్యయనం చేసిన మందడి శ్రావ్యారెడ్డి .
కొన్ని చోట్ల ప్రభుత్వం చేనేత ఎక్స్‌పో నిర్వహిస్తున్నా అందులో చేనేత కార్మికులకు స్టాల్స్‌ కేటాయించడం లేదు.


చేనేత వస్త్రాల పేరుతో మోసం ;

ఇతర ప్రయివేటు వ్యాపారస్తులు తక్కువ నాణ్యతగల చేనేత వస్త్రాలను చవక ధరలకి అమ్ముతున్నాయి. వినియోగదారులను మోసం చేస్తున్నాయి. రంగులు, నూలు, నేత డిజైన్లలో నాణ్యత గల చేనేత సంఘాల అమ్మకాలకు గండికొడుతున్నాయి. నాసిరకం రంగులు నఫ్థాల్‌ రంగులు, సింగల్‌ యార్న్‌ పద్ధతిని వాడి రూ. 150 ధర పలికే బట్టలను ప్రయివేటు వ్యాపారస్తులు రూ. 110 కే అమ్మగలుగుతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని వాటిని నిలువరించాలి. అంటున్నారు చేనేత కార్మికులు.


చేనేత రంగాన్ని ఆదుకోవాలి ;
'' చేనేత రంగాన్ని కష్టాల ఊబిలోంచి బయట పడేయడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. చేనేత సంఘాలకి ప్రధాన నగరాలలో షాపులు కేటాయించాలి. డిఆర్‌డిఏ, బ్యాంకుల ద్వారా వడ్డీలు లేని రుణాలు మంజూరు చేయాలి. కార్మికుల రెక్కల కష్టంపై రూపుదిద్దుకునే 11 వస్త్రాలైన పట్టుచీరలు, ధోవతి, తువ్వాళ్లు, పరదాలు, దుప్పట్లు, వంటివి మరమగ్గాలు, కాటన్‌ మిల్లుల్లో ఉత్పత్తి కాకుండా చూడాలన్నదే ప్రధానమైన కోరిక. కార్మికులు నేసిన ప్రతి వస్త్రాన్నీ 'ఆప్కో' ద్వారా గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయించి, ముడిసరకును రాయితీ ధరలకు అందించాలి. మగ్గాల ఆధునికీకరణకు బ్యాంకు రుణాలు అందజేయాలి.'' అంటారు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులు రమేష్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: