తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఎంత ప్రాధాన్యం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రాజెక్ట్‌ సందర్శనలో భాగంగా సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పర్యవేక్షించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ స‌జీవ గోదావ‌రిని ఆవిష్క‌రించామ‌ని తెలిపారు. దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఏరియల్ వ్యూద్వారా పరిశీలించారు. మేడిగడ్డ బరాజ్‌పై కాలినడకన తిరిగి, గోదావరి తల్లికి వాయినాలు సమర్పించారు. అనంతరం గోలివాడ పంప్‌హౌస్‌ను సందర్శించారు. తదుపరి ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను, ఆవశ్యకతను వివరించారు. 



సీఎం కేసీఆర్ ఉమ్మ‌డి కరీంనగర్ జిల్లాలో ప‌ర్య‌టించి అక్క‌డే విలేక‌రుల స‌మావేశం నిర్వహించిన నేప‌థ్యంలో జీవ‌న్‌రెడ్డి అక్క‌డే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌ ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల  ప్రజాధనం వృథా అవుతోందని మండిప‌డ్డారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్టిమేట్లు పెంచిందని ఆరోపించారు. అంచనాలు పెంచినా ఆశించిన ఫలితాలు రాలేదని కానీ నిర్వహణ ఖర్చులు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం మోపారని జీవన్ రెడ్డి అన్నారు. యాభైవేల కోట్ల అదనపు భారానికి సీఎం నైతిక బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి  అన్నారు.


కేంద్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. రాష్ట్రమే సహకరించడంలేదని కేంద్రం చెబుతోందన్నారు. రెండు ప్రభుత్వాల వైఖరితో రాష్ట్ర ప్రజలపై యాభైవేల కోట్ల రూపాయల భారం పడుతోందని తెలిపారు. తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ కట్టి ఉంటే 4వేల కోట్ల నిర్వహణ భారం తప్పేదని ఆయన అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38 వేల కోట్ల ఎస్టిమేట్ చేస్తే.. అదే ప్రాజెక్టు పేరు మార్చి అదనంగా 50 వేల కోట్లకు పెంచారన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న టీఆర్ఎస్ కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టుతో  ఖర్చు ఎక్కువ ప్రయోజనం తక్కువని, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు కేవలం టూరిజం ప్రాంతంగా మిగులుతుందని ఎద్దేవా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: