జగన్ ఢిల్లీకి వెళ్ళింది మొదలు తెలుగుదేశం ఆగమాగం అయిపోతోంది. గతంలో చంద్రబాబు వూ అంటే చాలు స్పెషల్ ఫ్లైట్ ఎక్కి హస్తిన చేరి హల్ చల్ చేసేవారు. అలా ఇలా కాదు, రాజు వెడలే రవితేజములలరగ అనుకుంటూ వెంట పరివారాన్ని, మంత్రి సామంతులను తీసుకుని మరీ వెళ్ళేవారు. అక్కడకు వెళ్ళి ఆయన ఏం సాధించారో తెలియదు  కానీ మీడియా మీట్లు అదిరిపోయేవి. ఇక అనుకూల మీడియాలో రాతలు భూమి బద్దలయ్యేంతగా సాగిపోయేవి. తీరా అయిదేళ్ళలో బాబుకు అక్కడ ఇచ్చిందీ లేదు,  ఆయన గారు తెచ్చిందీ లేదు. ఇపుడు జగన్ వెళ్ళారు..


దాతో టీడీపీకి ఎక్కడలేని ఉక్రోషం తన్నుకువస్తోంది. తమ అధికారాన్ని కొట్టేసి మరి జగన్ బాబు ఢిల్లీలో  దర్జా చేస్తున్నాడన్న ఉలుకు టీడీపీది, ఇవన్నీ ఇలా ఉంటే జగన్ కేసీయార్ని కలసినా మోడీని కలసినా చంద్రబాబుకు వణుకు పుడుతోంది. ఆ వేడిలో ఆయన ఏవేవో విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ జగన్ వెళ్ళింది ఏపీకి సాయం కోసమా లేక నా మీద ప్రధానికి ఫిర్యాదులు చేయడానికా అంటూ బాబు ఓ రేంజిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ఇక బాబు గారి మాజీ మంత్రి సామంతుడు అయిన యనమల రామక్రిష్ణుడైతే జగన్ టూర్ ఎందుకు వెళ్ళారో  చెప్పాలని  లేఖ రాసి మరీ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ జగన్ వెళ్ళింది దేనికి అని ఆయన నిగ్గదీస్తున్నారు. సరే జగన్ ఢిల్లీ వెళ్ళి మోడీకి ఫిర్యాదే చేశారనుకున్నా నిప్పులాంటి బాబు గారికి కలవరం ఎందుకు. ఆయన అన్నీ కరెక్ట్ గానే చేసారు కదా. మరి ఆయన ఎందుకు ఉలికిపాటుపడుతున్నారో అర్ధం కావడంలేదు.


మరో పార్టీ ఉంది. ఆ పార్టీ ఏపీ బీజేపీ శాఖ. కేంద్రంలో తమ పెద్దలను జగన్ కలిసివస్తే ఫరవాలేదు. తమ గురించి  ఏమైనా చాడీలు చెప్పారా ఏంటి అని ఆ పార్టీ నేతలు ఆరా తీస్తున్నారుట. అవును  మరి జగన్ సర్కార్ ఏమైనా  తప్పులు చేస్తే విమర్శించమని హై కమాండ్ అనొచ్చు. కానీ ప్రతీ పూటా చిట్టా పద్దులు అప్పగించినట్లుగా జగన్ని నానా మాటలు అనమని ఎవరైనా చెప్పారా. అందువల్ల్లనే లోకల్ కమలం నేతల్లో జగన్ ఢిల్లీ పెద్దల భేటీలో ఏం చెప్పారోనని  అనుమానిస్తున్నారుట. మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్ కాదు కానీ ఆ రెండు పార్టీలలో చర్చవాడిగా  వేడిగానే సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: