కశ్మీర్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న బీజేపీ కి తిరుగులేనట్టేనా?

ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిలో చెలరేగుతున్నాయి.


మోదీ, అమిత్‌ షా లు అత్యుత్సాహంగా తీసుకున్న నిర్ణయం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమా కాదా అన్నది సుప్రీంకోర్టు డిసైడ్‌ అవుతుంది. కశ్మీర్‌ ముఖ చిత్రాన్ని మార్చివేసే రెండు తీర్మానాలు, ఒక బిల్లును అమిత్‌ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీనికి తోడు జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్‌ 35ఏను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ తీర్మానం చేశారు. అలాగే, జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు కశ్మీర్‌లో బీజేపీ వ్యూహం ఏంటో తెలుసుకుందాం.


.. ప్రస్తుత నియోజక వర్గాల సంఖ్యను బట్టి కశ్మీర్‌ లోయ ఆధిక్యంలో ఉంది. అక్కడ 46 అసెంబ్లీ స్థానాలు, జమ్ములో 37, లడఖ్‌లో 4 ఉన్నాయి. జమ్ములో స్థానాలను కశ్మీర్‌ కంటే పెంచి ఎన్నికల్లో బిజెపి అత్యధిక సీట్లు గెలుచుకునేలా చేసి మొదటి సారిగా ఆ రాష్ట్రానికి హిందూ ముఖ్యమంత్రిని నియమించాలనే యోచన కూడా నడుస్తున్నట్టు..రాజకీయ విశ్లేషకుల భావన. మరొక ప్రత్యామ్నాయంగా కశ్మీర్‌, జమ్ము, లడఖ్‌లను మూడు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలని కూడా పథక రచన చేసున్నట్టు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ కశ్మీర్‌ లోయలోని ముస్లిం జనాభాను ఇప్పటి కంటే ఎక్కువగా, అసంతృప్తికి గురి చేసి ఉగ్రవాదానికి మరింతగా చోటు కల్పిస్తాయని ఆ రాష్ట్రానికి ఇప్పుడున్న సెక్యులర్‌ స్వరూపాన్ని కొనసాగించి అక్కడి ప్రజల సహకారంతోనే ప్రధాన సమస్యకు సామరస్య పూర్వకమైన భారత్‌కు అనుకూలమైన పరిష్కారాన్ని సాధించుకోవాలని విజ్ఞులు సూచిస్తున్నారు.


ఏ రకంగానైనా, ఏ మార్గంలోనైనా కశ్మీర్‌ సమస్యకు తక్షణమే శాశ్వతంగా తెర దించాలని దృఢ  సంకల్పం వహించినట్టు కనిపిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ సూచనను మన్నించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.

ఎవరికీ సాధ్యం కాని రీతిలో కశ్మీర్‌ను తామే దారికి తెచ్చామని చెప్పుకోడం ద్వారా దేశాధికారాన్ని ఎల్లకాలం నిలబెట్టుకోవాలనే దృష్టి బిజెపి ఆలోచనను ప్రభావితం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ( cartoon by subhani)

మరింత సమాచారం తెలుసుకోండి: