ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి తన చిరకాల కోరిక తీర్చుకునే దిశగా అడుగులేస్తున్నారు. నల్గొండ నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన గుత్తా ప్రత్యక్ష రాజకీయాలకు ఇప్పటికే గుడ్ బై చెప్పేశారు. రెండు వేల పద్నాలుగు లో కాంగ్రెస్ ఎంపీ గా గెలిచిన గుత్తా ఆతరువాత కారెక్కారు. నాడే ఎమ్మెల్సీ ని చేసి క్యాబినెట్ లో చోటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారట. ఆ తర్వాత రాష్ట్ర రైతు సమన్వయ సమితికి గుత్తాని చైర్మన్ గా నియమించారు. కానీ మంత్రివర్యా అనిపించుకోవలన్న కోరిక మాత్రం అలానే ఉండి పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ దిశగా కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతి త్వరలోనే గుత్తా మంత్రి కావడం ఖాయమని ఆయన అనుచర వర్గం చెప్తోందట.


ఎమ్మెల్సీ కోసం గుత్తా చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇటీవల గుత్తా ఎమ్మెల్సీ అయినట్టే అని అంతా భావించారు. కానీ లాస్ట్ మినిట్ లో నవీన్ రావు సీన్ లోకి రావడంతో చాన్స్ మిస్సైంది.  నాడు సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగానే నవీన్ కి అవకాశమివ్వడంతో గుత్తా సైలెంట్ గా ఉండిపోయారు. మళ్లీ అవకాశం ఎప్పుడూ అనుకుంటున్న వేళ యాదవరెడ్డి ఎమ్మెల్సీ అనర్హత వివాదంపై హైకోర్ట్ తీర్పు ఇచ్చేసింది. దీంతో ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక జరిగే ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా పేరును కేసీఆర్ ఖరారు చేసేశారు. తెలంగాణ శాసనసభలో టిఆర్ ఎస్ కు తిరుగులేని మెజార్టీ ఉండడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక లాంఛనప్రాయం మాత్రమే.


మరోవైపు అతి త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉందని టిఆర్ ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఆ సమయానికి గుత్తా ఎమ్మెల్సీ కూడా అయిపోతారు. సో గుత్తా సుఖేందర్ రెడ్డి చిరకాల కోరిక తీరే సమయం ఆసన్నమైందని టిఆర్ ఎస్ లో చర్చ సాగుతోందట. మరోవైపు ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదన్న వాదన కూడా గులాబీ కండువాలు మధ్య వినబడుతోందట. ఒకవేళ ఆలస్యమైనా కొన్ని నెలలు మాత్రమే అని ఆ తర్వాత జరిగే విస్తరణల్లో అయినా గుత్తా కు చాన్స్ కన్ఫామ్ అని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోందట. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానన్న మాట తప్పకుండానే తమ నేత క్యాబినేట్ లో బెర్త్ ఖాయం చేసుకోబోతున్నారనీ అనుచరులు సంతోషంగా చెప్తున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: