తెలంగాణ‌ రాష్ట్రంలోని జూనియర్ వైద్యులు స‌మ్మె విరమించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లుకు వ్యతిరేకంగా వారు సమ్మె చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సమ్మె విరమణపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..సమ్మె విరమించాలని జూనియర్ వైద్యులను కోరితే సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. కేంద్రంతో మాట్లాడతామని చెప్పామ‌ని, హామీ ఇచ్చినట్లుగానే నిన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడినట్లు తెలిపారు.వైద్యుల ప్రయోజనాలకు ఇబ్బంది కాబోదని కేంద్ర‌మంత్రి చెప్పారని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు.. జూనియర్ వైద్యులకు కేంద్రమంత్రితో చర్చల సారాంశాన్ని వివరించామన్నారు. నిబంధనల తయారీ సందర్భంలో అందరి అభిప్రాయాలు చెబుతామన్నారు. ప్రగతి నిరోధకంగా ఉన్న వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 


 కొత్తగా ప్రవేశపెట్టనున్న మెడికల్ కమిషన్ బిల్లులో ఉన్న క్రాస్‌పథిని డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. క్రాస్‌పథి అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ చదవిన వారు కూడా అలోపతి ట్రీట్‌మెంట్ ఇవ్వడం. ప్రైవేటు మెడికల్ కాలేజీలపైన కూడా ప్రభుత్వ ఆధిపత్యం పెరగనున్నట్లు ఐఎంఏ జాతీయ కార్యదర్శి డాక్టర్ జయేశ్ లీల్ తెలిపారు. బిల్లులో కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ వైద్య మండలిని వ్యతిరేకిస్తున్నట్లు ఐఏంఎ పేర్కొన్నది. మెడికల్ కమిషన్ బిల్లు పేదలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఆ బిల్లు వల్ల అవినీతి ఎక్కువయ్యే ఆస్కారం ఉందని జయేశ్ చెప్పారు. ఇన్నాళ్లూ ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అమలులోకి రానున్నది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న మెడికల్ కమిషన్‌లో ఎక్కువ మంది సభ్యులు ప్రభుత్వ నియమిత డాక్టర్లే ఉంటారని, దాని వల్ల బిల్లులో ఉన్న అనేక అంశాలు సమస్యాత్మకంగా మారుతాయని డాక్టర్లు అంటున్నారు. 


ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రస్తుత బిల్లుతో పర్మిషన్ మరింత సులువు కానున్నది. అండర్‌గ్రాడ్యువేట్, పోస్ట్ గ్రాడ్యువేట్ సీట్లను కూడా పెంచనున్నారు. కాలేజీల్లో ఏదైనా లోపం జరిగితే, వాటిపై చర్యలు తీసుకునే వెసలుబాటు లేదన్నారు. దాని స్థానంలో భారీ జరిమానాను విధించనున్నారు. అది కూడా సుమారు 5 కోట్ల నుంచి వంద కోట్ల వరకు జరిమానా వసూల్ చేయనున్నారు. అంటే ఇదొక రకంగా అవినీతిని ప్రోత్సహించడమే అవుతుందని కొందరు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు కాలేజీల్లో సుమారు 60 శాతం సీట్ల ఫీజులను కూడా కాలేజీలే డిసైడ్ చేసుకునే వీలును కల్పిస్తున్నారు. కాగా, తాజాగా సమ్మె ఉప‌సంహ‌రణ‌తో సేవ‌లు అంద‌నున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: