పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వివిధ దేశాల రాయబారులు, హై కమిషనర్లు, కాన్సుల్‌ జనరల్స్‌తో శుక్రవారం విజయవాడలో, డిప్లొమాటిక్‌ ఔట్‌ రీచ్‌ కార్యక్రమం జరిగింది. దక్షిణ కొరియా, బ్రిటన్‌, సింగపూర్‌, పోలండ్‌, బల్గేరియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలతోపాటు మొత్తం 15 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అరకు గిరిజనులు పండించిన అరకు కాఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సమావేశం అనంతరం, జిసిసి(Girijan Co-operative Corporation )  ఏర్పాటు చేసిన కాఫీ స్టాల్‌ను పలువురు విదేశీ ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ కూడా సందర్శించి కాఫీని రుచి చూసి, మైమరచి పోయారు.

జగన్‌, కాఫీ సాగుచేస్తున్న రైతుల గురించి అక్కడి జిసిసి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అరకు కాఫీ వెనుక అసక్తికరమైన కథనం ఇది...


ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో 1898లో బ్రిటిషు అధికారి 'బ్రాడీ' చేత కాఫీ పంట ప్రారంభమైంది. అక్కడ్నించి పుల్లంగి, విశాఖ జిల్లా గూడెం గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ సాగు మొదలైంది. 1920 నాటికి కాఫీ అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకి కూడా, ఈ పంట విస్తరించింది.


'అరకు కాఫీ' పుట్టుక...

1956 లో గిరిజన సహకార సంస్ధ ఏర్పాడ్డాక, కాఫీ బోర్డు వారు ఈ సంస్ధని కాఫీ తోటల అభివ ద్ధి కోసం వుపయోగించుకోవాలని నిర్ణయించారు. ఆ రకంగా , జిసిసి గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపకం మొదలు పెట్టింది. 1975 నుంచి 1985 వరకు జిసిసి ద్వారా సుమారు 4000 హెక్టర్ల కాఫీ తోటల పెంపకం అరకు ప్రాంతాల్లో మొదలయ్యింది. ఈ రకంగా సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనులు పండిస్తున్న కాఫీకి 'అరకుకాఫీ' అనే పేరు స్ధిరపడింది. ప్రభుత్వం ఒక్కో గిరిజన కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున కాఫీ తోటల్ని పంచి ఇవ్వడంతో నేడు లక్ష ఎకరాల్లో, కాఫీ తోటలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు.


'అరకు కాఫీ'

'' విశాఖజిల్లా అరకు ప్రాంతంలోని అరేబికా రకం కాఫీ అత్యంత ప్రసిద్ధి చెందింది. పనస, సిల్వర్‌ఓక్‌, మరియు అరటి చెట్ల నీడలో పెరిగే యీ కాఫీ సేంద్రియ పద్దతుల్లో సాగుచేస్తున్నారు. అరకులోయలో నివసిస్తున్న వారిలో, లక్షకు పైగా గిరిజన రైతులు యీ కాఫీ పంట ద్వారా ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ ప్రాంత గిరిజనులు తాము సాంప్రదాయకంగా చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ సాగు చేయడంతో అడవులను కాపాడినట్టయింది. అరకు లోయలో కాఫీ తోటలు సుమారు 900 నుంచి 1100 మీటర్ల ఎత్తులో సాగుచేయడం వల్ల ఈ నేలలో మితమైన క్షారగుణం కలిగినందువల్ల ఇక్కడ పండే కాఫీకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏర్పడ్డాయి. కాఫీ గింజల పరిమాణం లోగాని, నేలసారం వలన కలిగే గుణాల వలన, మితమైన పుల్లటి జీర జిహ్వకి తగులుతూ, స్పష్టమైన గాఢతర సువాసన, మరియు నాలుకకి తగల గానే నరాల్ని కదిలించే క్షారగుణంతో 'అరకు కాఫీ' ఒక ప్రత్యేకమైన రుచి గల కాఫీగా మారింది..'' అని, జిసిసి మాజీ ఎండీ ఆకెళ్ల రవిప్రకాశ్‌ అరకు కాఫీకి అద్భుత రుచి ఎలా వచ్చిందో వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: