కాంగ్రెస్ పార్టీ  కొత్తసారథి ఎంపిక కోసం ఢిల్లీ కేంద్రంగా ఒక‌రోజంతా కీల‌క ప‌రిణామాలు సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే.  కొత్త సారథి ఎంపిక కోసం శనివారం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్‌గాంధీ ససేమిరా అనడంతో పార్టీ మాజీ అధ్యక్షురాలివైపు సీడబ్ల్యూసీ మొగ్గు చూపింది. కొత్త సారథిని ఎంపిక చేసేంతవరకు సోనియాగాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఈ విష‌యం రాహుల్‌కు తెలియ‌కుండానే జ‌రిగిందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

అధ్యక్షుడి ఎంపికలో అన్ని రాష్ర్టాల నేతల అభిప్రాయలను తెలుసుకునేందుకు రాహుల్‌ సూచన మేరకు ప్రాంతాల వారీగా ఐదు సబ్‌కమిటీలను ఏర్పాటుచేశారు. ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన కమిటీలో అహ్మద్‌ పటేల్‌, అంబికా సోనీ, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ ఉన్నారు. తూర్పు ప్రాంత కమిటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌, కేంద్ర మాజీ మంత్రి కుమారి షెల్జా ఉన్నారు. ఉత్తర ప్రాంత కమిటీలో ప్రియాంకాగాంధీ, జ్యోతిరాదిత్య సిందియా, పీ చిదంబరం ఉన్నారు. పశ్చిమ ప్రాంత కమిటీలో గులాం నబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, మోతీలాల్‌ ఓరా ఉన్నారు. దక్షిణ ప్రాంత కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆనంద్‌శర్మ, ముకుల్‌ వాస్నిక్‌ ఉన్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి కూడా సంప్రదింపుల ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ కమిటీలు నివేదికలు సిద్ధం చేసిన అనంతరం రాత్రి మరోసారి సీడబ్ల్యూసీ సమావేశమైంది. వాటిపై సుదీర్ఘంగా చర్చించింది. జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులపైనా చర్చలు జరిపింది.చాలా కొద్ది మంది మాత్రమే పార్టీ అధ్యక్షుడిగా ఇతరుల పేర్లను సూచించారని, రాహుల్‌ కొనసాగకపోతే పార్టీలో వలసలు పెరుగుతాయని మెజార్టీ సభ్యులు హెచ్చరించినట్లు తెలిసింది. 


కాంగ్రెస్ సీనియ‌ర్ల స‌మావేశంలో సీనియర్​ నేతలు మల్లికార్జున్​ఖర్గే, ముకుల్ ​వాస్నిక్​ తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. ఎంపిక విషయంలో రాత్రి పొద్దుపోయే వరకూ కమిటీ ఎటూ తేల్చలేదు. రెండు దఫాలుగా సాగిన మీటింగ్​ఏ ఫలితం తేలలేదు. రాత్రి పదిన్నర ప్రాంతంలో నేతల పిలుపుతో పార్టీ ఆఫీసుకు చేరుకున్న రాహుల్​గాంధీ.. పది నిమిషాల పాటు చర్చలో పాల్గొని బయటకొచ్చారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్​లో హింస చెలరేగిందనే రిపోర్టు అందడంతో సీడబ్ల్యూసీ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించలేదన్నారు. ఆ తర్వాత కాసేపటికే పార్టీ తాత్కాలిక చీఫ్​గా సోనియా గాంధీ వ్యవహరిస్తారనే ప్రకటన వెలువడింది. దీంతో సోనియా ఎంపిక విష‌యం ఆయ‌న‌కు తెలియ‌దా అనే చ‌ర్చ జ‌రిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: