ఆగస్ట్ వచ్చిందంటే అందరికీ పండుగలా ఉంటుంది. ఎందుకంటే అతి పెద్ద సుదినంగా స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15న జరుపుకుంటారు. ఇక ఇదే ఆగస్ట్ లో శ్రావణమాసం రావడంతో కొత్త శోభతో తెలుగింటి లోగిళ్ళు అంతటా కళకళలాడుతాయి.  వానలు పడడంతో వాతావరణం కూడా  చల్లబడుతుంది. ఇటువంటి ఉత్సాహపూరితమైన ఆగస్ట్ నెల కొందరికి అచ్చిరాదంటే వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం పచ్చి నిజం.


ఆగస్ట్ కి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అన్న నందమూరి రెండు మార్లు ఇదే ఆగస్ట్ నెలలో వెన్నుపోట్లకు గురి అయి అధికారం కోల్పోయారు. ఆయన్ని మొదటిసారి ఆగస్ట్ నెలలో దించేసింది అప్పటి టీడీపీలో కో పైలట్ గా ఉన్న నాదెండ్ల భాస్క‌రరావు. ఆయన ఆర్ధికమంత్రిగా  ఉంటూ పార్టీ, ప్రభుత్వ బాధ్యతలు మొత్తం చూశారు. ఆ సమయంలో అమెరికా వెళ్ళిన ఎన్టీయార్ తిరిగి రాగానే నాదెండ్ల వెన్నుపోటు పొడిచి దించేశారు. దాంతో అన్న గారు నెలరోజుల పాటు పోరాటం చేశారు. చివరికి ధర్మం గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో అల్లుడుగా చంద్రబాబు ఎన్టీయార్ వెంటే ఉన్నారు. మొదటి ఆగస్ట్ సంక్షోభంలో మామను కాపాడిన బాబు క్యాంప్ రాజకీయాలు చేయడంలో దిట్ట అనిపించుకున్నారు.


ఆ విధంగా ఆయన తన అనుభవాన్ని రంగరించి మరీ రెండవమారు అంటే 1995 ఆగస్ట్ నెలలో మామకు వెన్నుపోటు పొడిచి అధికారం హస్తగతం చేసుకున్నారు. అంటే సరిగ్గా పదకొండేళ్ళకు అన్న మాట ఆగస్ట్ సంక్షోభం పార్టీలో తలెత్తింది. మామను అల్లుడు వెన్నుపోటు పొడవడం ఏంటి అని తెలుగుజనం విస్తుపోయారు. ఇక నందమూరి కుటుంబం కూడా ఇందుకు సహకరించడంతో సులువుగా బాబు సీఎం అయిపోయారు.


ఇలా రెండుసార్లు అప్పట్లో ఆగస్ట్ సంక్షోభం తలెత్తినపుడు చంద్రబాబే తెర వెనకా, తెర ముందూ ఉన్నారు. ఆ విధంగా బాబుకు ఆగస్ట్ నెలకు ఎంతో గొప్ప అనుబంధం ఏర్పడింది. ఇప్పటికి 24 ఏళ్ళు అయింది బాబు వెన్నుపోటు ఉదంతం జరిగి. ఈ మధ్యలో ఎన్నో ఆగస్టులు వచ్చాయి. మరెన్నో సవాళ్ళూ కూడా టీడీపీకి ఎదురయ్యాయి. వాటిలో ప్లస్సులు, మైనస్సులు కూడా టీడీపీ సహించింది. భరించింది. అందుకే ఆగస్ట్ అంటేనే బాబుకు ఆయన పార్టీకి దడ పుట్టిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: