ఇరుగు పొరుగు రాష్ట్రాల మ‌ధ్య స్నేహం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో సంబంధాల విష‌యంలో...తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేప‌థ్యంలో...ఈ కార్యాచ‌ర‌ణను మ‌రింత వేగవంగా చేస్తున్నారు. తమిళనాడు కాంచీపురంలోని అత్తివరదరాజస్వామివారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంత‌రం తిరుమ‌ల బాలాజీని సంద‌ర్శించుకున్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఆస‌క్తికర కామెంట్లు చేశారు. రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి పెద్దన్నగా సహకరిస్తానని చెప్పారు. 


రెండు రాష్ర్టాల అభివృద్ధికి తాను, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ కలిసి పనిచేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రాయలసీమ కష్టాలు తనకు తెలుసునని, గోదావరి జలాలు రాయలసీమకు రావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. పట్టుదల ఉన్న యువ నాయకుడు జగన్‌తో అది సాధ్యమేనని చెప్పారు. రాయలసీమకు నీటితరలింపులో తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఏపీలో క్రియాశీలకంగా, పట్టుదలతో పనిచేసే జగన్ సీఎంగా ఉన్నందున గోదావరి తరలింపు తప్పక సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం గోదావరి నుంచి వెయ్యికిపైగా టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసిపోయాయన్నారు. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఇప్పటికే నిండాయని చెప్పారు. గోదావరి జలాల తరలింపుపై తాను, జగన్ ఇప్పటికే చర్చలు జరిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ విషయం కొందరికి జీర్ణం కాకపోవచ్చని అన్నారు. ప్రజల మద్దతు, దీవెన ఉన్నంతకాలం ప్రజల ఆశయాలను నెరవేరుస్తామని, రాలయసీమను రతనాలసీమగా మారుస్తామని స్పష్టంచేశారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి పనిచేస్తామని కేసీఆర్ ప్ర‌క‌టించారు. 60, 70 ఏళ్ల‌ తెలుగునేల చరిత్రలో జగన్, తాను కలిసి కొత్త చరిత్రను సృష్టించబోతున్నామని చెప్పారు. 


ఇదిలాఉండ‌గా, నగరి నియోజకవర్గం మీదుగా వెళ్లేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా మార్గమధ్యంలో సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. దారిపొడవునా స్వాగతతోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పెద్దసంఖ్యలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలిచి.. కేసీఆర్‌ను స్వాగతించారు. కేసీఆర్‌వెంట రోజా కూడా కాంచీపురం వెళ్లారు. అత్తివరదరాజస్వామి ఆలయంలో కేసీఆర్ దంపతులను ఆలయఅధికారులు, వేదపండితులు ఘనంగా స్వాగతించారు. ప్రత్యేక పూజల అనంతరం కేసీఆర్‌ను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: