తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంపై సంచలన కామెంట్లు చేశారు.  జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పీ చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ జమ్మూకశ్మీర్‌లో హిందూ ప్రజల ప్రాబల్యం ఎక్కువగా ఉండి ఉంటే..  బీజేపీ ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని ఎప్పటికీ రద్దు చేసి ఉండేది కాదని పేర్కొన్నారు. దీనిపై ప‌ళ‌నిస్వామి మండిప‌డ్డారు. కేంద్రమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన చిదంబరం భూమికి భారమే తప్ప ఆయన వల్ల దేశానికి ఒరిగేదీమీ లేదంటూ అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 


కావేరి నది నీటి వివాదం సహా తమ రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యలను చిదంబరం పరిష్కరించలేదని ప‌ళ‌నిస్వామి మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో చేసినట్లుగానే తమిళనాడును కేంద్ర భూభాగంగా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్లయితే, అధికార ఏఐఎడీఎంకె దాన్ని వ్యతిరేకించదా అన్న చిదంబరం విమర్శలకు పత్రిగా పళనిస్వామి ఇలా స్పందించారు. చిదంబరం ఎన్నేళ్లు కేంద్రమంత్రిగా ఉంటే ఏం లాభం? ఆయన ఏయే పథకాలు తీసుకొచ్చారు (ప్రధానంగా తమిళనాడుకు)? దేశానికి ఆయన వల్ల ఏం ఉపయోగం భూమిపై భారం తప్ప అని ముఖ్యమంత్రి పళనిస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


కాగా,  ‘జమ్మూకశ్మీర్‌ ఈ రోజు ఒక మున్సిపాలిటీగా మారిపోయింది. ఇతర రాష్ట్రాలకు ఆర్టికల్‌ 371 కింద ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఒక్క జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ఎందుకు తొలగించారు. ఎందుకంటే ఇది మతమౌఢ్యం కాబట్టి’ అని చిదంబరం బీజేపీపై ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్‌లో ముస్లిం ప్రజలు అధికంగా ఉన్నారు కాబట్టే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని, ఒకవేళ అక్కడ హిందువుల ఆధిక్యత ఉండి ఉంటే బీజేపీ ఈ నిర్ణయం తీసుకోనేది కాదని పేర్కొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: