టీఆర్ఎస్ నేత‌, తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీలో చేరడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. జంపింగ్‌ల విష‌యంలో చంద్రబాబు నోరుమెదపకపోవడమే ఇందుకు నిదర్శనమని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీజేపీలో చేరిక‌ల విష‌యంలోనూ ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.   


రాజకీయాల్లో కాలంచెల్లిన, ప్రజాదరణ కోల్పోయిన నాయకుల చేరికతో బీజేపీకి లాభమేమీ ఉండదని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఎద్దేవా చేశారు. క్యాడర్ లేకుండా నాయకులు చేరినంత మాత్రాన పార్టీ బలపడదని, కేంద్ర ప్రభుత్వ పలుకుబడి మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయదని స్పష్టం చేశారు. బీజేపీలో కొత్త నాయకులు లేరని, ఆ పార్టీలో గత రెండు మూడు దశాబ్దాలుగా ఉన్న నాయకులే ఇప్పుడూ ఉన్నారని, బీజేపీకి నిజంగా బలముంటే పరిషత్ ఎన్నికల్లో కనీస సీట్లను కూడా ఎందుకు గెలవలేకపోయిందని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు ఓడిపోతాడంటే చాలామంది నమ్మలేదని, అక్కడ ఫలితం ఏవిధంగా ఉన్నదో ఇప్పుడు అందరూ చూశారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉన్నందునే బ్యాలెట్ ఓటింగ్ ద్వారా 32 జెడ్పీలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టారని, దీనిని బీజేపీనేతలు గుర్తించడంలేదని తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. పొద్దునలేస్తే.. సీఎం కేసీఆర్ కుటుంబంపైపడి ఏడవడంతప్ప బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు రాష్ర్టాభివృద్ధి పట్టడంలేదని విమర్శించారు. 


ఎస్సీ వర్గీకరణకు అనుకూలమన్న బీజేపీ.. ఆ బిల్లును ఎందుకు ఆమోదించడంలేదని మంత్రి తలసాని ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. తన కుమారుడు సాయికిరణ్‌కు మేయర్ పదవి అడిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మంత్రి తలసాని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమన్నది కేవలం ఊ హాగానం మాత్రమేనని పేర్కొన్నారు. కశ్మీర్ అంశాన్ని రాజకీయ కోణంలో చూడలేమని, అందుకే పార్లమెంట్‌లో ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు టీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: