తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నివాసం పోయస్ గార్డెన్ అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది.  పోయస్ గార్డెన్ ను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉన్నా, అభిమానుల్లో సందేహాలు మాత్రం వీడలేదు. కానీ, ఇప్పుడా చిక్కు ముడులు దాదాపు వీడినట్టే. జయనివాసాన్ని స్మారకంగా మారుస్తూ జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపారు. 
35ఏళ్లపాటు జయలలిత నివసించిన ఈ భవనం అభిమానులకు దేవాలయంలా మారనుంది.

ఈ భవనాన్ని 1967లో జయలలిత తల్లి వేదవల్లి రూ.లక్ష 32 వేలకు కొనుగోలు చేశారు. 24 వేల చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ భవనంలో బిల్డ్  ఏరియానే 21,662 చదరపు అడుగులు. ప్రస్తుతం దాని విలువ రూ.45 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. నిజానికి పోయస్ గార్డెన్ అనగానే అది జయలలిత నివాసం పేరు అనుకుంటారు. కానీ ఇది చెన్నైలోని ఓ పోష్ ఏరియా పేరు. చెన్నై నగరంలో ఉండే ప్రాంతాల్లో పోయస్ గార్డెన్ కు ప్రత్యేకత ఉంది. చెన్నై నడిబొడ్డున  ఉండే అత్యంత విలాసవంతమైన  ప్రాంతంలో, జయలలిత ఇంటి పక్కనే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ఇతర కోటీశ్వరులు అనేక మంది నివశించే ప్రాంతం ఇది. చెన్నైలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, న్యాయవాదుల నివాసాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ ఏరియలో దాదాపు మూడు దశాబ్దాలుపైగా కళకళలాడిన వేద నిలయం జయ నివాసం. 

వేద నిలయంలోకి మహామహులకు మాత్రమే ప్రవేశం ఉండేది. మంత్రులకూ, బడా నేతలకు కూడా సమయం సదర్భం ఉంటేనే ఎంట్రీ. పైగా ఈ ఇంటిలో గెస్ట్ లకు నిర్దేశించిన ప్రదేశం తప్ప... భవనం అంతా సుపరిచితులైన వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. జయలలిత మరణం తర్వాత ఈ భవనం ఏమవుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. దీనికోసం జయ  స్నేహితురాలు శశికళ, మేనకోడలు దీపాజయకుమార్, అన్నాడీఎంకే పార్టీ, ఇలా .. ఎవరికి వారు పావులు కదిపారు. చివరికి చారిత్రాత్మక భవనం అభిమానులకు అందుబాటులోకి రాబోతోంది.  





మరింత సమాచారం తెలుసుకోండి: