అమెరికాలో వలసదారులపై మరో పిడుగు పడింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగించుకుంటే.. వీసాతో పాటు గ్రీన్ కార్డ్ విషయం కూడా మర్చిపోవాలని ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. వలసదారులు కచ్చితంగా తమ కాళ్లపై తాము నిలబడాల్సిందేనని, ఇమ్మిగ్రేషన్ విభాగం నిర్దేశించిన ఆదాయం ఉంటేనే వీసా వస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న వీసా అప్లికేషన్ లలో సగానికి పైగా తిరస్కరణకు గురవుతాయని అంచనా. 

అగ్రరాజ్యానికి అధ్యక్షుడైనప్పట్నుంచీ.. వలసదారులపై ట్రంప్ కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్.. అధికారంలోకి వచ్చాక అదే సూత్రాన్ని కచ్చితంగా అమలుచేస్తున్నారు. ఇప్పటికే వీసాదారులకు అధిక ఆదాయం ఉండాలని స్పష్టం చేసిన ట్రంప్.. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా వాడుకోవడానికి వీల్లేదని కొత్త చట్టం తెచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. వీసా, గ్రీన్ కార్డు కోసం అప్లై చేసిన వలసదారులు.. తమ కాళ్లపై తాము నిలబడతామని ఇమ్మిగ్రేషన్ విభాగానికి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఆటోమేటిగ్గా చాలావరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు వీళ్లను అనర్హుల్ని చేస్తూ వీసా మంజూరవుతుంది. 

ట్రంప్ చట్టంపై వలసదారుల న్యాయవాదులు మండిపడుతున్నారు. ఒకసారి అమెరికా వచ్చాక అందరూ అమెరికన్ పౌరులేనని, కానీ ట్రంప్ మాత్రం అమెరికన్లను, మిగతా దేశాలవాళ్లను విభజించి పాలించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఎవరేమనుకున్నా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఫ్యామిలీ డిపెండెంట్ కేటగిరీలో దాఖలైన గ్రీన్ కార్డు అప్లికేషన్లతో పాటు వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 2016లో అమెరికాలో 8 లక్షల మందికి గ్రీన్ కార్డులు వచ్చాయి. అయితే ఈ చట్టం అమలుతో అందులో సగం మందికి కూడా కార్డులు రావడం కష్టమేననే వాదన వినిపిస్తోంది. 

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు మాత్రం కొత్త చట్టాన్ని సమర్థించుకుంటున్నారు. గతంలో వలసదారులు తమ కాళ్లపై తాము నిలబడి.. అమెరికాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు వచ్చే వలసదారులు కూడా తమ పూర్వీకుల్ని ఫాలో కావాలని సూచిస్తున్నారు. అమెరికా వస్తే చాలు.. తమ సంగతి ప్రభుత్వమే చూసుకుంటుందనే ధోరణికి అడ్డుకట్ట వేయాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటున్నారు. ఆరోగ్యం, ఫుడ్ స్టాంపులు, ఇతరత్రా సౌకర్యాలు ఏవీ ప్రభుత్వం నుంచి వాడుకునేది లేదని వీసాదారులు తమ అప్లికేషన్లతో పాటే డిక్లరేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ 15 నుంచి కొత్త చట్టం అమలు కానున్న తరుణంలో.. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది. 








మరింత సమాచారం తెలుసుకోండి: