మొన్నటి వరకూ బంగారు తెలంగాణా నినాదాన్ని వినిపించిన కెసియార్ హఠాత్తుగా ఇపుడు ఆకుపచ్చ తెలంగాణా అనే కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. కెసియార్ హఠాత్తుగా ప్లేటు ఫిరాయించటం వెనుక కారణాలు ఏమై ఉంటాయి ? ఏమిటంటే, మొదటి ఐదేళ్ళు కెసియార్ ఎక్కడ మాట్లాడినా  బంగారు తెలంగాణా గురించే మాట్లాడేవారు. సరే కెసియార్ మాట్లాడుతున్నారు కాబట్టి సంతానంతో పాటు నేతలు కూడా అదే కోరస్ వినిపించేవారు.

 

రెండోసారి గెలవగానే బంగారు ప్లేస్ లో ఆకుపచ్చ వచ్చి చేరింది. కారణం ఏమిటంటే బంగారు తెలంగాణా రాదని కెసియార్ కు అర్ధమైందా ? లేకపోతే తాను చెప్పిన బంగారు తెలంగాణా వచ్చేసిందా ? అన్న విషయాన్ని కెసియారే చెప్పాలి. బంగారు తెలంగాణా నినాదం విషయంలో విపక్షాలైన కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు ఓ రేంజిలో కెసియార్ తో పాటు కుటుంబాన్ని ఏకిపారేసిన విషయం అందరూ చూసిందే.

 

కెసియార్ మాటల్లోని బంగారు తెలంగాణా కేవలం కెసియార్ కుటుంబానికి మాత్రమే వచ్చిందని ప్రతిపక్ష నేతలు ఎన్నిసార్లు ఆరోపణలు, విమర్శలు చేశారో లేక్కేలేదు. నిజానికి ప్రత్యేక తెలంగాణా కోసం పోరాటాలు చేసిన చాలామంది నేతలతో పోల్చుకుంటే కెసియార్ కానీ ఆయన కొడుకు కెటియార్ లేకపోతే కూతురు కవిత చేసిన పోరాటాలు తక్కువనే చెప్పాలి.

 

ఎంతోమంది విద్యార్ధులు తెలంగాణా రాష్ట్రం కోసం అమరులయ్యారు. అలాంటిది ప్రత్యేక తెలంగాణా వచ్చిన తర్వాత అలాంటి అమరుల కుటుంబాలను కెసియార్ పెద్దగా ఆదరించింది లేదనే చెప్పాలి. అందుకే కెసియార్ చెప్పే బంగారు తెలంగాణా ఓ విధంగా పెద్ద జోక్ అయిపోయింది.

 

 ఆ విషయం కెసియార్ కు కూడా బాగానే తెలుసు. అందుకెనే ముందస్తు ఎన్నికల్లో రెండోసారి సిఎం కాగానే బంగారు తెలంగాణా నినాదం స్ధానంలో ఆకుపచ్చ తెలంగాణా అంటూ మొదలుపెట్టారు. ఆకుపచ్చ తెలంగాణా అంటే ఎవరైనా పంటలు పండటం, ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించటం, రైతులు కుటుంబాలు పచ్చగా ఉండటం అనే అనుకుంటారు. మరి  కెసియార్ ఉద్దేశ్యంలో ఆకుపచ్చ తెలంగాణా అంటే ఏమిటో ఆయనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: