జనసేనాని పవన్ సమీక్షల పేరుతో చేస్తున్న ప్రకటనలు కొన్ని సంచలనం రేకెత్తిస్తున్నాయి. బహుశా తన వాయిస్ జనంలోకి ఈ విధంగా పోవాలని పవన్ స్ట్రాటజిక్ గా స్టేట్మెంట్స్ ఇలాంటివి ఇస్తున్నారనుకోవాలా. లేక ఆయన అమాయకంగా మాట్లాడుతున్నారనుకోవాలా అన్నది తెలియక పోయినా అన్న చిరంజీవి కంటే తెలివిగానే తమ్ముడు పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నాడని మాత్రం చెప్పాలి.


పార్టీ పెట్టకుండా 2014లో హీరో అయిన పవన్ కళ్యాణ్ ఇపుడు ఎన్నికల్లో గుండు సున్నాగా ఫలితాలు తెచ్చుకున్నా తాను రేసులో ఉన్నానని గట్టిగానే చెప్పుకుంటున్నారు. తనకు, జనసేనకు గ్లామర్ ఎక్కడా తగ్గలేదని పవన్ చెప్పకనే చెబుతున్నారు. తన పార్టీని విలీనం చేయమని ఓ పెద్ద పార్టీ తీవ్రంగా వత్తిడి తెస్తోందట. ఈ విషయాన్ని ఈ రోజు విజయవాడ పార్టీ రివ్యూ మీటింగులో పవన్ ప్రకటించి అందరినీ షాక్ తినిపించారు.


తాను మాత్రం పార్టీల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం చేయనని పవన్ అన్నారు. మరి అలా చేయకపోయిన పక్షంలో పవన్ నోట ఈ మాట ఎందుకు వచ్చిందన్న ప్రశ్న వస్తుంది. విలీనం గురించి పవన్ చెప్పడం ఇదే మొదటిసారి కాదు, అంతకు ముందు కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. తన పార్టీని విలీనం చేయనని ఆయనే ఖండన కూడా ఇచ్చుకుంటున్నారు. ఇది పవన్ మార్క్ పాలిటిక్స్ అనుకోవాలేమో.


పెద్ద పార్టీ అంటే కచ్చితంగా అది బీజేపీ అయి ఉండొచ్చు. దానికి ఆధారాలు కూడా పవన్ మాటల బట్టే ఉన్నాయనుకోవాలి. అమెరికా పవన్ వెళ్ళినపుడు రాం మాధవ్ ని ఆయన కలిశారు. ఆ తరువాత ప్రత్యేక హోదా విషయంలో జనమే పోరాడాలంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇక బీజేపీ కాశ్మీర్ విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని పవన్ సపోర్ట్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గతంలోనూ పవన్ తన పార్టీని బీజేపీ విలీనం చేయమందని చెప్పుకున్నారు. స్వయంగా అమిత్ షా అడిగారని కూడా అయన వెల్లడించారు. 


ఇపుడు పేరు చెప్పలేదు కానీ పెద్ద పార్టీ అంటున్నారు. మరి పవన్ చెప్పింది కొంతవరకూ నిజమేనని నమ్మాలనుకున్నా  పదే పదే పవన్ విలీనం చేయను అనడంతోనే అసలు డౌట్లు వస్తున్నాయి. ఎందుకిలా ఆయన ప్రకటనలు చేస్తున్నారు అన్నది కూడా చర్చ అవుతోంది. బహుశా ఈ ప్రతిపాదన మొగ్గ దశలో ఉండి ఉంటుందని, అందువల్లనే పవన్ వూగిసలాటలో ఈ మాటలు అంటున్నారనుకోవాలి. లేకపోతే పవన్ కాదంటే అవుననిలే అన్న రాజకీయం తెలిసి మాట్లాడుతూ ఉన్నారనుకోవాలి. ఏది ఏమైనా పవన్ విలీనం ప్రకటనలు  మాత్రం క్యాడర్ కి కొత్త అనుమానాలు తెప్పిస్తోందంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: