పెరుగుతున్న వరద కృష్ణా కరకట్ట వాసులను భయపెడుతుంది. గంట గంటకు పెరుగుతున్న నీళ్లు కరకట్ట పరిసర ప్రాంతాలను ముంచే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కరకట్ట పరిసరాలలోని చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగి కనిపిస్తున్నాయి. పూరిళ్ళు, గుడిసెలు నీళ్లల్లో మునిగి ఉన్నాయి. వరద ఇలాగే కొనసాగితే ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి చుట్టూ వరద నీరు వచ్చి చేరింది.

చంద్రబాబు నివాసంలోకి కూడా వరద ప్రవాహం వచ్చింది. వరదనీళ్ళు బాబు ఇంటి మెట్లను తాకాయి. చంద్రబాబు ఇంట్లోకి నీళ్లు వచ్చి చేరాయంటే దాని చుట్టూ ఉన్న ప్రాంతాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికే కరకట్టపైన ఉన్న భవనాల్లో ఎవరు ఉండకూడదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో లంక గ్రామాలు మునిగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. ఏ క్షణంలోనైనా వరద ముంచెత్తే అవకాశం వుండటంతో లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో పడ్డారు అధికారులు.

ఇప్పటికే చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒక్క విజయవాడ ప్రాంతం నుంచి దాదాపు రెండు వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటు కృష్ణా జిల్లా పరిధిలో 791 హెక్టార్ లలో పంటలు నీట మునిగాయి. అరటి, పసుపు, మిర్చి, బొప్పాయి తోటలు ఇప్పటికే నీట మునిగాయి. కూరగాయల తోటలు పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయాయి.కృష్ణా నదిలో ఏడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నది. వరద ధాటికి లంగరు వేసి ఉంచిన నాటు పడవలు కొట్టుకు పోయాయి. ఈ ఉదయానికి ప్రకాశం బ్యారేజి నుంచి నాలుగున్నర లక్షల నీటిని విడుదల చేయడం మొదలు పెట్టారు.

దీంతో అన్నవరపు లంకా, బొమ్మనివారిపాలెం, కొత్తూరులంక గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు అధికారులు. మరో మూడు,నాలుగు రోజుల్లో కృష్ణా నదిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పులిచింతల దగ్గర నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతుంది.పులిచింతల ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతుండడంతో 22 గేట్లు ఎత్తేశారు. ప్రస్తుతం పులిచింతల ఇన్ ఫ్లో 5.46 లక్షల క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో 6.16 క్యూసెక్కులు ఉంది.

పులిచింతల ప్రాజెక్ట్ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి ప్రవాహం 39.459 టీఎంసీలకు చేరింది. కృష్ణమ్మ పరుగులతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. పులిచింతల ప్రాజెక్ట్ కి 5.46 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా సుమారు 4,50,000 క్యూసెక్ ల నీటిని ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజ్ కు ఇంతలా జలకళ సంతరించుకోవడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. కృష్ణమ్మ గలగలలను చూసి తన్మయత్వం చెందుతున్నారు.

సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే కృష్ణా నదిలో పెరిగిన వరద ఉధృతిపై ముఖ్యమంత్రి జగన్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమెరికా పర్యటనకు ముందు ఈ సమీక్ష కొనసాగింది. వరద పెరగడంతో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం జగన్. వరద సహాయక చర్యల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: