ఐక్యరాజ్యసమితి రహస్య సమావేశం నిర్వహించడానికి కారణం భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం.కాశ్మీర్ విభజన అనంతరం పాకిస్తాన్ రాసిన లేఖకు స్పందనగా ఈ సమావేశం నిర్వహించింది ఐక్యరాజ్యసమితి..ఇది రహస్య సమావేశమే అయినప్పటికీ ఆర్టికల్ 370 రద్దు చేయడమన్నది పూర్తిగా భారతదేశ ఆంతరంగిక వ్యవహారమని ఇందులో ఇతర దేశాలకు ఎలాంటి సంబంధం లేదని ఐక్యరాజ్యసమితిలోని భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు.అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక ప్రగతిని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని,జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికి రక్షణ చర్యలు చేపట్టామని చెప్పిన అక్బరుద్దీన్ పాకిస్తాన్ మీద కూడా వ్యాఖ్యలు చేశారు.




జిహాద్ పేరిట జరిగే హింస గురించి ఒక దేశం మాట్లాడుతోందని,హింసాత్మక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అనుమతించేదిలేదని ఒకవేళ పాకిస్తాన్ కనుక భారతదేశంతో చర్చలు జరపాలంటే ముందుగా ఉగ్రవాదాన్ని నిరోధించాలని అక్బరుద్దీన్ కోరారు.ఐక్యరాజ్యసమితి రహస్య సమావేశం తరువాత చైనా రాయబారి జాంగ్ జున్ మాట్లాడుతూ,ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పరిష్కరించుకోవాలని,ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదని భద్రతామండలి సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయని అంతేకాకుండా అక్కడి మానవహక్కుల పరిస్థితి గురించి కూడా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు.




ఈ సందర్భంగా లద్దాఖ్ అంశాన్ని కూడా చైనా ప్రస్తావిస్తూ అది తమ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని వ్యాఖ్యానించింది.కాగా,తాజా నిర్ణయంతో భారతదేశం కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చిందని పాకిస్తాన్ అంటోంది.ఆ దేశ రాయబారి మలీహా లోధీ మాట్లాడుతూ,చాలా దశాబ్దాల తరువాత ఈ అంశం మళ్ళీ భద్రతామండలిలో చర్చకు వచ్చిందని,ఇకపై ఇది భారతదేశ ఆంతరంగిక సమస్య కానేకాదని అన్నారు.
 



ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ కూడా ఈ అంశంపై ఇప్పటికే ఒక ప్రకటన చేస్తూ భద్రతా మండలిలో జరిగిన చర్చలో నేను విన్నదాని ప్రకారం సభ్యులందరూ జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు.మానహక్కుల పరిరక్షణ గురించి కూడా సందేహాలు వ్యక్తం చేశారు.ఈ అంశంతో సంబంధం ఉన్న పక్షాలు ఏవైనా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు.అలా చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని చెప్పారు.ఇక కొసమేరుపు ఏంటంటే భారత్, పాకిస్తాన్‌లు భద్రతామండలి సభ్య దేశాలు కానందున అవి ఈ రహస్య సమావేశంలో పాల్గొనలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: