తప్పుడు ధృవపత్రాలతో పశ్చిమ గోదావరి జిల్లాలోని బ్యాంకులను బురిడీ కొట్టించి కోట్ల రూపాయల కొట్టేసిన బడాబాబులపై ఫోకస్ పెట్టింది సిబిఐ. డెల్టా ప్రాంతాల్లో చేపల చెరువుల పేరుతో కొందరు వ్యవసాయం పేరుతో, ఇంకొందరు ఫేక్ డాక్యుమెంట్ లు పెట్టి బ్యాంకుల్లో భారీ మొత్తాల్లో రుణాలు తీసుకుని అడ్రస్ లేకుండా పోయారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు పెట్టే బ్యాంకు ఉద్యోగస్తులు, మోసగాళ్లతో కలిసి భారీ స్కాములు చేసినట్టుగా సీబీఐ దృష్టికి వెళ్లడంతో అక్రమార్కుల పని పట్టేందుకు రంగంలోకి దిగారు ఉన్నతాధికారులు. ఆక్వా రంగానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న పశ్చిమ గోదావరి డెల్టా ప్రాంతంలో నకిలీ రైతులు బ్యాంకులను బురిడీ కొట్టించారు. ఒకటి కాదు, రెండు కాదు వందల కోట్ల రూపాయలకు ఫేక్ డాక్యుమెంట్ ల రూపంలో ఎగనామం పెట్టారు.


లోన్లు తీసుకున్న రైతులు చెరువులు, భూములు ఉన్నట్లుగా ఆధారాలు చూపించి కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడం, ఆ తర్వాత అడ్రస్ లేకుండా చెక్కేయడంతో బ్యాంకులకు భారీగా నష్టాలు వస్తున్నాయి. రుణాలు ఇచ్చేముందు సవాలక్ష ఆంక్షలు విధించే బ్యాంకులు ఇలాంటి మోసగాళ్లతో చేతులు కలిపిన ఉద్యోగులు తమ వాటా తీసుకుని లోన్లను శాంక్షన్ చేయటం, ఆ తర్వాత ఏం జరిగినా తమకు సంబంధం లేదనే ధోరణితో ఉండడం పరిపాటిగా మారిపోయింది. లేని భూములు ఉన్నట్టుగా చేపల చెరువులు తమవిగా చూపించి భారీ మొత్తంలో అప్పులు తీసుకున్న వారు కొందరైతే, అసలు యజమానులకు తెలియకుండా వారి పాస్ పుస్తకాలతో వారికే తెలియకుండా లోన్లు తీసుకున్న విషయాలు వెలుగులోకి రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.


అప్పులు వందల కోట్లలో పెండింగ్ ఉండటంతో ఆకివీడు, భీమవరం. ఉండి, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాలకు చెందిన కొందరిని సిబిఐ భయం ప్రస్తుతం వెంటాడుతుంది. రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో రిజర్వు బ్యాంక్ నిబంధనలు విధించింది. వరి, చిరు ధాన్యాల సాగు లాగానే ఆక్వా రంగాన్ని కూడా వ్యవసాయ రంగంలో కలపడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. చట్టంలోని లొసుగులను అడ్డు పెట్టుకుని కొందరు వందల కోట్ల రూపాయల రుణాలుగా పొందారు. కొన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టుకున్న స్థిరాస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు తనిఖీలు చేయగా సరైన డాక్యుమెంట్ లు లేవనే విషయాలు బయట పడుతున్నాయి.


భీమవరంలోని రెండు బ్యాంకులలోనే 370 కోట్ల రూపాయిల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉండగా జిల్లా వ్యాప్తంగా సుమారు 650 కోట్ల పైనే స్కాం జరిగిందన్న సమాచారంతో సిబిఐ బ్యాంకు ఉన్నతాధికారుల బృందం గతంలో ఆయా బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసింది. భీమవరం పట్టణ పరిధికి చెందిన కొందరు కృష్ణా జిల్లాలోని కొల్లేరు పరిసర ప్రాంతాల్లో భూములు, ఇతర ప్రాంతాల్లోని భూముల పత్రాలు అప్పట్లో బ్యాంక్ అధికారులకు అందజేసి మోసగించినట్లు గుర్తించారు. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటంతో బ్యాంక్ ఉన్నతాధికారులు పెద్దగా చర్యలు తీసుకోలేక పోతున్నారని విమర్శలున్నాయి. గతంలో ఏలూరు సహకార అర్బన్ బ్యాంక్ లో నకిలీ డిపాజిట్ పత్రాలతో కోట్ల రూపాయల గోల్ మాల్ పై రెండు వేల పదిహేడు జనవరిలో కలెక్టర్ ఆదేశాల మేరకు పదమూడు మందిపై కేసు నమోదు చేశారు.


చాటపర్రులో పలు బ్యాంకుల్లో మోసాలను గుర్తించారు. చాగల్లు ఆకివీడు లోని ప్రభుత్వరంగ బ్యాంకు కు ఏ ఆధారాలు లేకుండా రుణాలు మంజూరు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బడాబాబుల రుణాలు తీసుకుని కనీసం వడ్డీ కూడా కట్టకుండా తప్పించుకుని తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. బ్యాంకు నోటీసులు పంపినా స్పందించలేదు సరే, కనీసం తనఖా పెట్టిన ఆస్తులు అయినా అమ్ముకుందామనుకున్న బ్యాంకు అధికారులు డాక్యుమెంట్ లు చూసి ఖంగుతిన్నారు. ఇవన్నీ నకిలీ డాక్యుమెంట్లేనని అసలు చాలా వరకు చేపల చెరువులు లేవని తేలడంతో సీబీఐకి ఫిర్యాదు చేశారు. వీరితో పాటు శర్మ అసోసియేట్స్ ఎం శ్రీనివాసులు, రిటైర్డ్ కల్నల్ సాహు వంశీకృష్ణ వలసి, అసోసియేట్స్ సోమశేఖరరావు, సుభాష్ ,సిండికేట్ సీఐ చంద్ర కుమార్ పేర్లు కూడా ఎఫ్ ఐ ఆర్ లో ఉన్నాయి. మొదటి, రెండో నిందితులుగా బ్యాంకు మాజీ ఉన్నతాధికారులే ఉన్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల్ని లైట్ తీసుకున్న బడాబాబులు ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగడంతో ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: